థర్మల్.. వేగిరం | Damaracherla zone veerlapalem Thermal Power Plant | Sakshi
Sakshi News home page

థర్మల్.. వేగిరం

Published Sat, Jan 17 2015 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

Damaracherla zone veerlapalem Thermal Power Plant

నల్లగొండ టుటౌన్ : దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్‌పూర్ గ్రామాల మధ్య ఏర్పాటుచేయనున్న థర్మల్‌పవర్ ప్లాంట్ పనులను జిల్లాయంత్రాంగం వేగవంతం చేసింది. నిన్నమొన్నటిదాకా భూ సర్వే చేపట్టిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. భూ సేకరణలో ఎక్కువగా అటవీ భూములు ఉండడంతో ముందుగా వాటిని అటవీయేతరులుగా మార్చే పనిలో పడ్డారు. వీటిపై ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అందరితో తీర్మానం ఆమోదించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వీఆర్‌ఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చడానికి గ్రామసభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దామరచర్ల మండలంలో ప్రభుత్వం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి సంబంధించి మండలంలోని 12 గ్రామాలలో దాదాపు 10 వేల 700ల ఎకరాలలో భూ సేకరణ సర్వే కూడా పూర్తయిందన్నారు.
 
 అందువల్ల అక్కడి అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చడానికి శనివారం నుంచి గ్రామసభలు నిర్వహించాలన్నారు. అధికారులు 12 గ్రామాలకు టీములుగా బయలుదేరి వెళ్లి గ్రామసభలు నిర్వహించి తీర్మానంపై గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంతకాలు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో టీమ్ లీడరుగా వ్యక్తిగత శ్రద్ధ చూపాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు వివరించి వారి సందేహాలను నివృత్తి చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. 12 మంది తహసీల్దార్లను 12 గ్రామాలకు టీమ్ లీడర్లుగా నియమించామన్నారు. వీఆర్‌ఓ, అటవీ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను 12 గ్రామాలకు కేటాయించి 17వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రామాలకు చేరుకుని నిర్దేశించిన పనిని పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్‌ఓ నిరంజన్, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
 ప్లాంట్‌పై గ్రామసభలు
 దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మండలంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్టు పై శనివారం పలుగ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు. మండలంలోని అటవీభూములు కలిగి ఉన్న వీర్లపాలెం, కొండ్రపోల్, దిలావర్‌పూర్, కల్లెపల్లి, నర్సాపురం, ముదిమాణిక్యం, వాచ్యతండా, కేజేరెడ్డి కాలనీ, బాలాజీనగర్, తి మ్మాపురం గ్రామాల్లోని గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామసభలకు తనతోపాటు తహసీల్దార్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్‌ఓలు  హాజరు కానున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement