సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ఓట్లు కురిపించే పథకాలకు మరింత పదును పెడుతోంది. తద్వారా గులాబీ పార్టీకి ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వ్యవహరించే తీరు మైనస్‌గా మారుతోందని గుర్తించారు. అంతర్గత సర్వేల ద్వారా ఇవి బయట పడుతుండడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో సగంమంది డేంజర్ జోన్‌లో ఉన్నారని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ కొద్ది మందిని స్వయంగా గులాబీ దళపతి సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకనైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది.
ఏడు నుంచి తొమ్మిది..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతా గులాబీ పార్టీకి సానుకూల పవనాలు బలంగా వీచినా ఒక పార్లమెంంట్, ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది.
పనితీరుపై ఆరా
ఇంతకాలం ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా దృష్టి సారించని సీఎం కేసీఆర్ ఇటీవల తరచుగా అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్లు తెలిసింది.. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను కూడా బహిర్గతం చేశారు. తాజాగా చేయించిన సర్వేలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ముగ్గురి పరిస్థితి ‘డేంజర్ జోన్’లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. డేంజర్ జోన్ ఉన్నట్లు చెబుతున్న ఓ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తన నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఒక్కసారి మాత్రమే రాత్రివేళ విడిది చేశారట. ఇలాంటి పరిస్థితులో నియోజకవర్గ ప్రజలు ఎలా విశ్వసిస్తారని సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఇదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేల బలహీనతలను స్వయంగా సీఎం కేసీఆర్ వారికే నేరుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలపై..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, మెజార్టీ ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల సాను కూలత వ్యక్తమైందని సర్వేల్లో వెల్లడవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా రానున్న ఎన్నికల్లో పాల మూరు ప్రాంతంలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేయాలని అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ఉమ్మడి పాలమూరు పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న వైనా న్ని ప్రస్తావిస్తున్నారు. అయితే పార్టీకి సానుకూల పవనాలు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి ముప్పుగా మారే ప్రమాదం ఉం దని సర్వేల ద్వారా వెల్లడైందట. చాలా మంది ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోతే ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు ఎంచుకోవాలనే యోచనలోగులాబీ బాస్ ఉన్నట్లు సమాచా రం. ఇప్పటికే రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల తో పాటు ద్వితీయశ్రేణి నాయకులు భారీ సంఖ్య లో కారె క్కారు. పార్టీ తరఫున ఎవరిని నిలి పితే విజయం తథ్యమనే దిశగా పార్టీ అధిష్టానం యో చిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment