
‘ఆ ఘటనతోనే శిరీషకు మనస్తాపం’
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష మృతి ముమ్మాటికీ ఆత్మహత్యేనని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. కుకునూర్‌పల్లిలో జరిగిన ఘటనతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని మంగళవారం ఆయన విలేకరులతో చెప్పారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికతో తేలుతుందని, రిపోర్టు కోసం వేచిచూస్తున్నామన్నారు. శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్‌లను విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ప్రకారం శిరీష ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. శిరీష తన ఫోన్‌లో పంపించిన గూగుల్ లోకేషన్‌ను పూర్తిగా పరిశీలించినట్టు వెల్లడించారు.
శిరీష, రాజీవ్, శ్రావణ్, ప్రభాకర్‌రెడ్డి ఫామ్‌హౌస్ వెళ్లారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈనెల 12న అర్ధరాత్రి ఎస్సై గదిలోనే వీరందరూ ఉన్నట్టు ఆధారాలున్నాయని తెలిపారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఫామ్‌హౌస్ ఉందని, అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించినట్టు చెప్పారు. శిరీష బంధువులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. రాజీవ్, శ్రావణ్‌లను రేపు కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.