పంట ఎండింది.. గుండె పగిలింది
కరెంట్ కోతలతో కళ్ల ముందటే పంట ఎండిపోవట్టే.. వేసిన బోర్ల అప్పులు ఎక్కువయ్యే. బ్యాంకుల రుణమేమో మాఫీ కాలే. భవిష్యత్తు అంతా అంధకారమే కనిపించే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువరైతు బతుకు మీద ఆశ వదులుకున్నాడు. చేనులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని అనాధను చేశాడు. భార్య, పిల్లలను వదిలి కానరాని లోకాలకు పయనమయ్యాడు.
* పాల్వంచలో యువరైతు ఆత్మహత్య
* అప్పులు ఎక్కువ కావడం
* రుణం మాఫీ కాకపోవడంతో మనస్తాపం
* పంట చేనులోనే ఉరికి వేలాడిన అన్నదాత
మాచారెడ్డి: ఆరుగాలం శ్రమించిన పంట ఎండిపోయింది. బోర్లు తవ్వించిన అప్పు వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సం ఘటన సోమవారం మాచారెడ్డి మండలం పా ల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నర్సింహులు (35) అనే రైతు తన సొంత చెరుకు తోట లో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మండల కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్‌లో నర్సింహులకు రూ.45 వేల పంట రుణం ఉంది. సోమవారం బ్యాంకుకు వెళ్లిన ఆయన తన రుణం మాఫీ అయ్యిందా అని బ్యాంకు అధికారులను అడిగాడు. కాలేదని వారు సమాధానం చెప్పారు.దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.‘అప్పులైన యి.బ్యాంక్‌ల రుణంమాఫీకాలేదు.. కొత్త రుణం రాలేదు.. పంట ఎండిపోవట్టే.. పిల్లలు చిన్నగున్నరు ఏం చేద్దాం’ అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని భార్య లక్ష్మి రోధిస్తూ చె ప్పింది.
నర్సింహులు ఆయన సోదరుడు బాల్‌రాజు కలిసి నాలుగు ఎకరాల భూమిలో ఓ బోరు తవ్వించారు. ఆ బోరు నీరు తక్కువగా పోయడంతో నర్సింహులు మరో మూడుబోర్లు అదనంగా వేయించాడు. అవి వట్టిపోయాయి. రూ.లక్ష వరకు అప్పు అయ్యింది. ఎకరం చెరుకు, మరో ఎకరం వరి సాగుచేశాడు. కరెంట్ కోతలతో చెరుకుతోట సగం వరకు ఎండిపోయింది. సాగుచేసిన వరిపంట సైతం ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నర్సిం హులుకు ఉరి తాడే దిక్కయ్యింది.
చనిపోతున్నానని చెప్పి...
నర్సింహులు చనిపోవడానికి ముందు సమగ్ర సర్వేలో భాగంగా వచ్చిన తప్పు ఒప్పులను సరి దిద్దుకోవడానికి గ్రామపంచాయతీ వద్ద ఉన్న గ్రామస్తుడు పరశురాములుకు చూయించాడు. ఇదేమి సర్వేనో ఏమోనని మదనపడి, ఓ దిక్కు అప్పులు పెరిగిపోతున్నయి. రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు పరశురాము లు తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి నేరు గా గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. వెళ్లిన మరుక్షణమే గ్రామానికి చెందిన గ్రామసేవకుడు మశ్చందర్‌కు ఫోన్ చేశాడు. ‘‘కాకా నాకు బతకాల నిపిస్తలేదు చనిపోతు న్నా. రుణమాఫీ కాలేదు.. పంట ఎండిపోతుం ది. కరెంట్ ఎద్దెం మద్దెంగా ఉంది, నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా.
నా భార్య, పిల్లలు పయిలం’’ అంటూ నర్సింహు లు చెప్పడంతో మశ్చందర్ వద్దని వారించాడు. ‘ఎందుకు సచ్చిపోతావ్ బిడ్డా, అందరం బతక లేమా నువ్వుకూడా గట్లనే బతుకు, చిన్న చిన్న పిల్లలున్నరు అద్దు బిడ్డా’ అని బదులివ్వడంతో నర్సింహులు ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెం దిన ఆయన గ్రామస్తులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునేలోగానే నర్సింహులు టేకు చెట్టుకు విగత జీవై కనిపిం చాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న భార్య లక్ష్మి ‘‘చేనుకాడికి పోయివస్తానని శవమయ్యా వా’’ అంటూ బోరున విలపించింది. లోకం పోకడ తెలియని చిన్నారులు.. ‘‘నాయిన చెట్టు ఎక్కాడా అమ్మా’’ అంటూ అమాయకంగా అడగడంతో అక్కడ ఉన్న హృదయా లు కలచివేశాయి. నర్సింహులుకు భార్య లక్ష్మి, కూతురు అశ్విని(09), కుమారుడు నితిన్(06) ఉన్నారు. మాచారెడ్డి ఎస్‌ఐ ప్రసాద్‌రావు, ఏఎస్‌ఐ ముజీ బ్, హెడ్‌కానిస్టేబుల్ మురళి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతదేహంతో రైతుల ఆందోళన
నర్సింహులు మృతదేహంతో శనివారం సాయంత్రం పాల్వంచ గ్రామం వద్ద కా మారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రా స్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడం, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, విద్యుత్ సమస్య లు తీర్చాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. పాల్వంచ ఎంపీటీసీ సభ్యుడు గ్యార చంద్రయ్య, ఉపసర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాగౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.