సింగూరు వట్టిపోతోంది!
డెడ్ స్టోరేజీకి నీరు
- 50 రోజులకు మించి నీటి సరఫరా కష్టమే
- ప్రస్తుత నీటిమట్టం 1.8 టీఎంసీలే
- వర్షాలు పడకుంటే ఇబ్బందే..
పుల్కల్: జిల్లాతోపాటు, జంటనగరాల తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన జలాశయమైన సింగూరులో పూర్తి స్థాయిలో నీటి మట్టం పడిపోయింది. ఈ నెలలో వర్షాలు కురవకుంటే జంటనగరాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సింగూర్ ప్రాజెక్ట్‌లోకి చుక్కనీరు చేరలేదు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎమ్‌సీల నీటి నిల్వ ఉంది. ఈసారి (513.82 మీటర్లు) దారుణంగా 1.8 టీఎంసీలకు పడిపోయింది.
జంట నగరాలతో పాటు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతుంది. ప్రధానంగా సింగూరు దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్‌లో ఇప్పటికే పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో విడతల వారీగా సింగూర్ నుంచి ఆరు నెలలుగా మూడు టీఎంసీల నీటిని విడుదల చేశారు. కేవలం తాగు నీటి అవసరాలకు ఉపయోగించినా... సింగూర్ నీరు మరో యాభై రోజుల కంటే ఎక్కువ సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
మంజీరాలోకి కొత్త నీరు
మనూరు: ఎగువనున్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా మంజీరా నదిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇన్నాళ్లు ఎండిపోయిన మంజీరా నదికి జీవం పోసినట్లు అవుతుందని పరీవాహక ప్రజలు అంటున్నారు. రెండు రోజులగా కురుస్తున్న వర్షాల వల్ల నదిలోని గుంతల్లో నీరు చేరిందని స్థానికులు తెలిపారు. పశువులకు కొంతమేర తాగునీటి సమస్య తీరిందని, భారీ వర్షం పడితే తప్ప మంజీరాకు పూర్వ వైభవం రాదంటున్నారు. గౌడ్‌గాం జన్‌వాడ నుంచి తోర్నాల్ వరకు మంజీరా పూర్తిగా అడుగంటింది. ఇరవయ్యేళ్లలా మంజీరా ఇంతలా ఎండి పోవడం ఇదే తొలిసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.