ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఆదిలాబాద్: ఏడాది కిందట చనిపోయిన కానిస్టేబుల్‌కు పదోన్నతి లభించింది. అంతేకాదు పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఇది వినడానికి వింతగా ఉన్నా జరిగింది మాత్రం సత్యం. పని చేస్తున్న కాలంలో పదోన్నతి కోసం ఎదురు చూశాడో లేదో కాని ఆ కానిస్టేబుల్‌కు మరణానంతరం ఉన్నతి లభించడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం 140 మంది పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. అందులో నిర్మల్ జిల్లా కడెం పోలీసుస్టేషన్ నుంచి జలపతి కానిస్టేబుల్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. ఆయనకు నిర్మల్ జిల్లాలోనే లక్ష్మణచాందలో పోస్టింగ్ కేటాయించారు. అయితే.. జలపతి ఏడాది కిందటే మృతిచెందాడు. దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన జలపతి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చిందని కూడా పలువురు చెబుతున్నారు. జాబితాలో జలపతి పేరు చూసిన కడెం పోలీస్‌స్టేషన్ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యమో అంటూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం వరకు ఇది ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చకు దారితీసింది.
ఒక వైపు పదోన్నతుల కోసం ఎదురు చూపు..
ఒక వైపు పోలీసు కానిస్టేబుళ్లు ఏళ్లకేళ్లుగా అదే పోస్టులో పని చేస్తూ పదవీ విమరణ చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తున్నారన్న వార్తతో వారిలో భరోసా వ్యక్తమైంది. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లకు ఈ పదోన్నతి కల్పించారు. ఈ బ్యాచ్‌లో సుమారు 280 మంది వరకు ఉండగా 140 మందికి పదోన్నతి ఇచ్చారు. దాదాపు సర్వీసులో చేరిన 28 సంవత్సరాల తర్వాత వారికి పదోన్నతి రావడం గమనార్హం. సాధారణంగా కానిస్టేబుళ్ల సర్వీసుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో పొందుపరుస్తుంటారు. పదోన్నతులు కల్పించే సమయంలో కానిస్టేబుళ్ల సర్వీసు మ్యాటర్‌ను పూర్తిగా పరిశీలిస్తారు. పనిష్మెంట్, ఇతరత్రా ఆరోపణలు ఉన్న వారి నుంచి సర్వీసు క్లియర్‌గా ఉన్నవారికి మొదట ప్రాధాన్యత ఇస్తారు.
అదే సమయంలో చనిపోయిన వారి పేర్లను నమోదు చేసుకుంటారు. పదోన్నతుల సమయంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది సరైన పరిశీలన చేయకపోవడంతోనే జలపతికి పదోన్నతి లభించినట్లు చర్చించుకుంటున్నారు. వందల మంది కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం ఎదురు చూస్తుంటే డీపీవో సిబ్బంది నిర్వాహకంతో ఇతరులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. చనిపోయిన వ్యక్తికి పదోన్నతి కల్పించారంటే.. జాబితా పరిశీలన సూక్ష్మంగా జరిగిందా అన్న చర్చ సాగుతోంది. సీనియార్టీ లిస్ట్, రోస్టర్ పాయింట్ ఇతర అంశాలను పరిశీలించిన పిదపనే పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చనిపోయిన వ్యక్తికి పదోన్నతి కల్పించడం ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న మరో కానిస్టేబుల్ నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ విషయంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌ను వివరణ కోరగా తాను కనుక్కుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment