సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. కరోనా కేసుల నమోదులోనే కాదు.. వైరస్ బారిన పడ్డ వారి మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. మూడో విడత లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం మొదలైంది. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా, జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. రెండు వారాల్లో దాదాపు 100 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన మరణాల సగటు..
కరోనా వైరస్ బాధితులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. మూడో విడత లాక్‌డౌన్ అనంతర పరిస్థితులను పరిశీలిస్తే.. రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య భారీగా ఉంది. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 5 శాతం మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 21 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,936 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వంద మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ కేసుల్లో సగటున 5 శాతం మరణాలు నమోదయ్యాయి. జూన్ నెల 1 నుంచి 7 వరకు పరిశీలిస్తే.. 950 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. ఈ లెక్కన రోజువారీ మరణాల సగటు 5.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వందకు పైగా వస్తున్నాయి.
3 రోజుల్లో పావు వంతు..
కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 137 మంది మరణించారు. ఇందులో ఈ నెల 5, 6, 7 తేదీల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. ఈ మూడు రోజుల్లో ఏకంగా 32 మంది మృత్యువాత పడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటివరకు నమోదైన మరణాల్లో పావు వంతు మంది మూడు రోజుల్లోనే చనిపోయారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం జరిగిన వైద్య శాఖ అధికారుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జనసంచారం మరింత పెరుగుతుందని, దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment