మరో పోరు
డిసెంబర్‌లోపు ఉప ఎన్నిక
వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ
రాజీనామా చేసిన కడియం శ్రీహరి
టీఆర్‌ఎస్‌కు కీలక పరీక్ష
వరంగల్ : జిల్లాలో మరో కీలక రాజకీయ పోరుకు తెరలేచింది. అన్ని రాజకీయ పార్టీలకు పరీక్ష ఎదురవుతోంది. గరిష్టంగా ఆరు నెలల్లోపు వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగనుంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కడియం శ్రీహరి గురువారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఢిల్లీలో స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. లోక్‌సభ స్పీకర్ రెండు, మూడు రోజుల్లో కడియం రాజీనామాను ఆమోదించనున్నారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్ లోక్‌సభకు వచ్చే డిసెంబరులోపు ఎప్పుడైనా ఉప ఎన్నికను నిర్వహించనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇదే కానుంది. వరంగల్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్.. తమ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అనివార్యత ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ ఎన్నికలో గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నించనుంది. టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో తామే ప్రత్యామ్నాయమని చెబుతుతున్న బీజేపీ కూడా ఉప ఎన్నికల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వైఎస్సాఆర్ సీపీ, వామపక్ష పార్టీలు ఉప ఎన్నిక గెలుపోటముల్లో కీలకపాత్ర పోశించనున్నాయి. వివిధ పార్టీల రాష్ట్రస్థాయి నాయకుల రాకపోకలతో ఇప్పటికే జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. కడియం రాజీనామా ఆమోదం తర్వాత ఇది ఇంకా పెరగనుంది.
పోటా పోటీ
కడియం శ్రీహరి జనవరి 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక త్వరలోనే జరుగుతుందని నిర్ధారణ అయ్యింది. దీంతో టీఆర్‌ఎస్‌లోని పలువురు నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా.. ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌లోని ఎస్సీ నేతలు గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి టిక్కెట్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇతర జిల్లాలకు చెందిన నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రక్రియ జిల్లా ఇన్‌చార్జి గాదరి బాలమల్లు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ లోక్‌సభ స్థానంలో తమ బలాన్ని చూపాలని కాంగ్రెస్ వ్యూహాలు మొదలుపెట్టింది. వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. పార్టీకి చెందిన కీలక నాయకులు తరుచు జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క.. ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రాథమికంగా సమాచారం సేకరించి వెళ్లారు. జిల్లాకు చెందిన నాయకులకే.. అదీ మాదిగ సామాజిక వర్గం వారికే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతలు సూచించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పోటీ చేసే అవకాశం ఉండదని కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ విషయం లో టీడీపీ-బీజేపీ కూటమిలో విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీయే ఉప ఎన్నికలో పోటీకి దిగుతుందని బీజేపీ నేతలు అం టున్నారు. సాధారణ ఎన్నికలో వచ్చిన ఫలితాల ను చూసి బీజేపీ తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు రెండు పార్టీలోనూ కనిపించడం లేదు.