warangal lok sabha seat
-
దయాకర్.. క్లియర్
టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి ఎంపిక కలిసొచ్చిన విధేయత తెలంగాణ భవన్లో రెండు రోజులుగా చర్చలు హన్మకొండ: వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పసునూరి దయాకర్ ఎన్నికల బరిలో దిగనున్నారు. రెండురోజుల తర్జనభర్జనల అనంతరం దయాకర్ పేరును ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఆ పార్టీ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి పసునూరి దయాకర్ నిబ ద్ధత, విధేయత కలిగిన నాయకుడిగా టీఆర్ ఎస్‌లో పని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎట్టకేలకు ఖరారు.. వరంగల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమై గురు, శుక్రవారాల్లో విస్తృతంగా సంప్రదించారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి పార్లమెంటు, ఢిల్లీ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సమర్థత కలిగి ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమ నేపథ్యం ఉండి, చట్టాలపై అవగాహనతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలలో పట్టున్న వ్యక్తిని ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. దీంతో గుడిమళ్ల రవికుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అరుుతే రవికుమార్ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం మరోసారి సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆఖరి నిమిషం వరకు రవికుమార్, దయాకర్ మధ్య అభ్యర్థిత్వ ఖరారు అంశం ఊగిసలాడగా చివరకు దయాకర్‌ను ఎంపిక చేశారు. కలిసి వచ్చిన విధేయత.. సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన దయాకర్‌కు వివాదరహితుడిగా పేరుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2008-11 మధ్య టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, 2011 నుంచి 2013 వరకు వర్ధన్నపేట నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. మలిదశ ఉద్యమంలో పని చేస్తున్నప్పుడే అగ్నిమాపకశాఖలో ఉద్యోగం వచ్చినా వదులుకుని తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఇవన్నీ గుర్తించిన కేసీఆర్ ఆయనకు ఉప ఎన్నికల బరిలో అవకాశం కల్పించారు. ప్రతిష్టగా మారిన ఎన్నికలు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య నియమితులయాయరు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఆయన బర్తరఫ్ కావడంతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి ఆ పదవి ద క్కింది. ఫలితంగా వ రంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ ఎస్‌లో అంతర్గత మార్పులతోనే ఈ ఎన్నిక జరుగుతుండటంతో పార్టీ విజయం తప్పనిసరని భావించిన కేసీఆర్.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. -
అభ్యర్థి ప్రకటనకు కొన్నాళ్లు ఆగుదాం
- వామపక్షపార్టీల నిర్ణయం - గద్దర్ నిర్ణయం కోసమే నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటనకు మరికొన్ని రోజుల సమయం తీసుకోవాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో పోటీచే యాలని ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరినందున, ఆయన నిర్ణయం కోసం కొంతకాలం వేచిచూడాలని అభిప్రాయపడ్డాయి. అందువల్ల వామపక్షాల తర ఫున వెంటనే అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని, గద్దర్ పోటీకి నిరాకరిస్తే ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. పోటీచేసే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు, ఈ దిశలో మరింతలోతుగా ఆలోచించేందుకు గద్దర్‌కు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయనందున, అభ్యర్థి ఖరారు విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని వెనక్కుతగ్గాయి. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన భేటీలో తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంపీసీఐ-యూ), గోవింద్ (ఆర్ఎస్పీ), దయానంద్ (ఫార్వర్డ్ బ్లాక్),తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ-చంద్రన్న, సీపీఐ (ఎంఎల్), లిబరేషన్ పార్టీల ప్రతినిధులు హాజరుకాలేదు. నేడు పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ... వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జరిగే బహిరంగ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, వామపక్షాల నేతలు చాడవెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు. -
ఇక దూకుడే!
* ‘నగర’ సమరానికి కాంగ్రెస్ సై * వరంగల్ లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేసుకునే వ్యూహం * ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు * సమస్యలపై సర్కారును నిలదీస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం * ఎన్నికల్లో విజయం కోసం ముఖ్య నేతలతో ఆరు కమిటీలు * నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న టీ పీసీసీ సీనియర్లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) దూకుడు పెంచింది. వీటితోపాటు వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికను సవాలుగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఇందుకోసం సీనియర్ నేతల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటుచేసుకుని ముందుకు వెళుతోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడడంతో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలను రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. ఆ కేసు ఏవిధంగా మలుపులు తిరుగుతుందన్నది జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలతో పాటు వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఆరు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కమిటీలో ఆరుగురు ముఖ్య నేతలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆరు కమిటీలు ఈనెల 21 నుంచి 25 వరకు 32 నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష, భవిష్యత్తు ప్రణాళికపై సమావేశాలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఆదివారం సమావేశాలు జరిగాయి. కార్యకర్తల అభీష్టం మేరకే.. స్థానిక నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే టికెట్ల కేటాయింపు జరుగుతుందని టీ పీసీసీ నేతలు భరోసాను ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్లకు పార్టీ టికెట్ల విషయంలో నేతల జోక్యం ఉండబోదని చెబుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను, విశ్వాసాన్ని పెంచడానికే ఈ సమావేశాలు జరుగుతున్నాయని... టికెట్ల కేటాయింపు పూర్తిగా స్థానిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్పై దాడి ముమ్మరం.. రాష్ట్రంలోని పలు అంశాలపై ఇప్పటిదాకా మెతకవైఖరితో వ్యవహరించిన టీపీసీసీ నేతలు.. తాజాగా టీఆర్ఎస్పై దూకుడు పెంచుతున్నారు. అంశాల వారీగా విమర్శలు గుప్పిస్తూ దాడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, డీఎస్, పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ తదితరులు తమ ప్రసంగాల్లో టీఆర్ఎస్ను, కేసీఆర్ వైఖరిని తూర్పారబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. పేదలకు రెండు బెడ్రూముల ఇళ్ల ఊసే లేదని ఆరోపించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ కేసీఆర్ హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సొంత ఇంటి దగ్గర పేరుకుపోయిన చెత్తను మీడియాకు చూపించారు. -
కాంగ్రెస్ నజర్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలు మొదలుపెడుతోంది. కాంగ్రెస్ సహజ శైలికి భిన్నంగా ఈ రెండు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. వరంగల్ లోక్‌సభ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్‌గా తీసుకుంటోంది. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. ప్రణాళిక రూపొందిస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక విజయం లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు బాధ్యతలు తీసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య ఒక్కో నియోజకవర్గానికి పర్యవేక్షకులుగా ఉండనున్నారు. ఆరు బృందాలుగా సమావేశాలుఅగ్రనేతల నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ ముఖ్య నేతలు ఆరు బృందాలుగా నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతి బృందంలో ఆరుగురు ముఖ్యనాయకులు ఉంటారు. పర్యవేక్షకుడి నేతృత్వంలోని ఈ బృందాలు ఈ నెల 25న జిల్లాకు వస్తున్నారు. అదే రోజు ఒకేసారి ఒకే సమయంలో ఆయా అన్ని నియోజకవార్గల్లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయంపై శ్రేణులతో అభిప్రాయాలు తీసుకోనున్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించనున్నారు. వరంగల్ లోక్‌సభలో గెలుపు కోసం అనుసరించే వ్యూహం ఎలా ఉండానేది నియోజకవర్గాల వారీగా చర్చించనున్నారు. -
మరో పోరు
డిసెంబర్‌లోపు ఉప ఎన్నిక వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ రాజీనామా చేసిన కడియం శ్రీహరి టీఆర్ఎస్కు కీలక పరీక్ష వరంగల్ : జిల్లాలో మరో కీలక రాజకీయ పోరుకు తెరలేచింది. అన్ని రాజకీయ పార్టీలకు పరీక్ష ఎదురవుతోంది. గరిష్టంగా ఆరు నెలల్లోపు వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక జరగనుంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కడియం శ్రీహరి గురువారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఢిల్లీలో స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. లోక్‌సభ స్పీకర్ రెండు, మూడు రోజుల్లో కడియం రాజీనామాను ఆమోదించనున్నారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్ లోక్‌సభకు వచ్చే డిసెంబరులోపు ఎప్పుడైనా ఉప ఎన్నికను నిర్వహించనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇదే కానుంది. వరంగల్ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తమ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అనివార్యత ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభ ఎన్నికలో గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నించనుంది. టీఆర్ఎస్కు భవిష్యత్తులో తామే ప్రత్యామ్నాయమని చెబుతుతున్న బీజేపీ కూడా ఉప ఎన్నికల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వైఎస్సాఆర్ సీపీ, వామపక్ష పార్టీలు ఉప ఎన్నిక గెలుపోటముల్లో కీలకపాత్ర పోశించనున్నాయి. వివిధ పార్టీల రాష్ట్రస్థాయి నాయకుల రాకపోకలతో ఇప్పటికే జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. కడియం రాజీనామా ఆమోదం తర్వాత ఇది ఇంకా పెరగనుంది. పోటా పోటీ కడియం శ్రీహరి జనవరి 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక త్వరలోనే జరుగుతుందని నిర్ధారణ అయ్యింది. దీంతో టీఆర్ఎస్లోని పలువురు నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా.. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన టీఆర్ఎస్లోని ఎస్సీ నేతలు గుడిమల్ల రవికుమార్, చింతల యాదగిరి టిక్కెట్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇతర జిల్లాలకు చెందిన నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్ఎస్ ఎన్నికల ప్రక్రియ జిల్లా ఇన్చార్జి గాదరి బాలమల్లు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో తమ బలాన్ని చూపాలని కాంగ్రెస్ వ్యూహాలు మొదలుపెట్టింది. వరంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. పార్టీకి చెందిన కీలక నాయకులు తరుచు జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క.. ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రాథమికంగా సమాచారం సేకరించి వెళ్లారు. జిల్లాకు చెందిన నాయకులకే.. అదీ మాదిగ సామాజిక వర్గం వారికే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతలు సూచించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పోటీ చేసే అవకాశం ఉండదని కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొనే నాయకుడి కోసం ప్రయత్నిస్తున్నామని అంటున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ విషయం లో టీడీపీ-బీజేపీ కూటమిలో విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీయే ఉప ఎన్నికలో పోటీకి దిగుతుందని బీజేపీ నేతలు అం టున్నారు. సాధారణ ఎన్నికలో వచ్చిన ఫలితాల ను చూసి బీజేపీ తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు రెండు పార్టీలోనూ కనిపించడం లేదు. -
ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా
న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచారు. అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేసిన టి. రాజయ్య అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో కడియం శ్రీహరికి మంత్రి పదవికి దక్కింది. విద్యాశాఖ నిర్వహిస్తున్న ఆయన ఉప ముఖ్యమంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.