అభ్యర్థి ప్రకటనకు కొన్నాళ్లు ఆగుదాం
- వామపక్షపార్టీల నిర్ణయం
- గద్దర్ నిర్ణయం కోసమే నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటనకు మరికొన్ని రోజుల సమయం తీసుకోవాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో పోటీచే యాలని ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరినందున, ఆయన నిర్ణయం కోసం కొంతకాలం వేచిచూడాలని అభిప్రాయపడ్డాయి. అందువల్ల వామపక్షాల తర ఫున వెంటనే అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని, గద్దర్ పోటీకి నిరాకరిస్తే ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
పోటీచేసే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు, ఈ దిశలో మరింతలోతుగా ఆలోచించేందుకు గద్దర్‌కు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయనందున, అభ్యర్థి ఖరారు విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని వెనక్కుతగ్గాయి. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన భేటీలో తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంపీసీఐ-యూ), గోవింద్ (ఆర్‌ఎస్‌పీ), దయానంద్ (ఫార్వర్డ్ బ్లాక్),తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ-చంద్రన్న, సీపీఐ (ఎంఎల్), లిబరేషన్ పార్టీల ప్రతినిధులు హాజరుకాలేదు.
నేడు పాలకుర్తిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ...
వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జరిగే బహిరంగ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, వామపక్షాల నేతలు చాడవెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.