ఇక దూకుడే!
* ‘నగర’ సమరానికి కాంగ్రెస్ సై
* వరంగల్ లోక్‌సభ స్థానాన్నీ కైవసం చేసుకునే వ్యూహం
* ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు
* సమస్యలపై సర్కారును నిలదీస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం
* ఎన్నికల్లో విజయం కోసం ముఖ్య నేతలతో ఆరు కమిటీలు
* నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న టీ పీసీసీ సీనియర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) దూకుడు పెంచింది.
వీటితోపాటు వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికను సవాలుగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఇందుకోసం సీనియర్ నేతల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటుచేసుకుని ముందుకు వెళుతోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడడంతో టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలను రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు.
ఆ కేసు ఏవిధంగా మలుపులు తిరుగుతుందన్నది జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలతో పాటు వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఆరు కమిటీలు ఏర్పాటయ్యాయి.
ఒక్కో కమిటీలో ఆరుగురు ముఖ్య నేతలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆరు కమిటీలు ఈనెల 21 నుంచి 25 వరకు 32 నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష, భవిష్యత్తు ప్రణాళికపై సమావేశాలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఆదివారం సమావేశాలు జరిగాయి.
కార్యకర్తల అభీష్టం మేరకే..
స్థానిక నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే టికెట్ల కేటాయింపు జరుగుతుందని టీ పీసీసీ నేతలు భరోసాను ఇస్తున్నారు. జీహెచ్‌ఎంసీ డివిజన్లకు పార్టీ టికెట్ల విషయంలో నేతల జోక్యం ఉండబోదని చెబుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను, విశ్వాసాన్ని పెంచడానికే ఈ సమావేశాలు జరుగుతున్నాయని... టికెట్ల కేటాయింపు పూర్తిగా స్థానిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌పై దాడి ముమ్మరం..
రాష్ట్రంలోని పలు అంశాలపై ఇప్పటిదాకా మెతకవైఖరితో వ్యవహరించిన టీపీసీసీ నేతలు.. తాజాగా టీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచుతున్నారు. అంశాల వారీగా విమర్శలు గుప్పిస్తూ దాడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, డీఎస్, పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ తదితరులు తమ ప్రసంగాల్లో టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ వైఖరిని తూర్పారబట్టారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. పేదలకు రెండు బెడ్‌రూముల ఇళ్ల ఊసే లేదని ఆరోపించారు. కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటూ కేసీఆర్ హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సొంత ఇంటి దగ్గర పేరుకుపోయిన చెత్తను మీడియాకు చూపించారు.