సాక్షి, సిరిసిల్ల: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం తుది గడువు కాగా ఎంతమంది బరిలో నిలువనున్నారు.. ఎంతమంది తప్పుకోనున్నారో, అసలు పోటీదారులెందరో తేలనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకరు, వేములవాడ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్థుల నామినేషన్‌పత్రాలు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు అంగీకరించడంతో ఆయా పార్టీల అనుబంధంగా వేసిన ఇతర అభ్యర్థులతోపాటు, నామినేషన్ పత్రాలను సరిగా పూర్తిచేయని మరికొంత మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపసంహరణ తర్వాత ఎన్నికల పోరులో నిలువనున్న అభ్యర్థుల సంఖ్య ఎంత అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల్లోకి చేరికలు, నియోజకవర్గం అంతటా పర్యటనలు, ర్యాలీలు, ప్రచార వ్యూహాలతో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
ప్రచారానికి మిగిలింది 14 రోజులే..
ముందస్తు ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే కొన్ని పార్టీలు తొలిదశ ప్రచారాన్ని పూర్తి చేసుకుని మలిదశ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా 14రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మైలేజీ పొందేలా అభ్యర్థులు ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ నియోజకవర్గంలో ఏదోఒక మూలన సభ, ర్యాలీ, సమావేశం, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రణాళిక చేసుకుంటున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లో పార్టీలు, జెండాల వేడి ఇంతకింతకు రాజుకోనుంది.
పెద్ద తలలపైనే భారం..
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో తమ శక్తియుక్తులను ధారబోశారు. ఇకపై ఉన్న సమయంలో తమదైన ప్రచారంతోపాటు తమతమ పార్టీల పెద్దల ప్రచార స మయాన్ని నియోజకవర్గంలో కేటా యించాలని ప్రయత్నాలు చేసుకుం టున్నారు. ఇప్పటి కే గులాబీ అధినేత కేసీఆర్ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వేడి పుట్టించగా.. అదే దిశగా మిగిలిన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు స్టార్ కాంపెయినర్ల సమయం కోసం జిల్లాలోని అభ్యర్థులు వేచిచూస్తున్నారు. వారిరాక కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మిగిలిన రెండు వారాల సమయంలో జిల్లాలో వివిధ పార్టీల నేతల అధినేతలు, పార్టీ పెద్దలు, స్టార్ కాంపెయినర్లతో మోత పుట్టించేం దుకు ఆయా పార్టీల అభ్యర్థులంతా రెడీ అవుతున్నారు.
నామినేషన్ తిరస్కరణకు గురైన
సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి
1) అర్వరాజు కృష్ణంరావు
– న్యూఇండియా పార్టీ
వేములవాడ అభ్యర్థులు..
1) ఆది వనజ – కాంగ్రెస్
2) ప్రతాప మార్తాండ తేజ – బీజేపీ
3) చెల్మెడ రాజేశ్వర్‌రావు
– టీఆర్‌ఎస్
4) మ్యాకల ఉదయ్‌కుమార్
– సమజ్‌వాదీ పార్టీ
5) కొండ దినేశ్ – ఇండిపెండెంట్
6) గోగుల రమేశ్
– సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా
7) గంటా ఇస్తరీ – ఇండిపెండెంట్
Comments
Please login to add a commentAdd a comment