![దయాకర్.. క్లియర్](/styles/webp/s3/article_images/2017/09/3/81446235488_625x300.jpg.webp?itok=lSWLMCpT)
దయాకర్.. క్లియర్
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి ఎంపిక
కలిసొచ్చిన విధేయత
తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా చర్చలు
హన్మకొండ: వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పసునూరి దయాకర్ ఎన్నికల బరిలో దిగనున్నారు. రెండురోజుల తర్జనభర్జనల అనంతరం దయాకర్ పేరును ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఆ పార్టీ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి పసునూరి దయాకర్ నిబ ద్ధత, విధేయత కలిగిన నాయకుడిగా టీఆర్ ఎస్‌లో పని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ఎట్టకేలకు ఖరారు..
వరంగల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమై గురు, శుక్రవారాల్లో విస్తృతంగా సంప్రదించారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి పార్లమెంటు, ఢిల్లీ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సమర్థత కలిగి ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమ నేపథ్యం ఉండి, చట్టాలపై అవగాహనతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలలో పట్టున్న వ్యక్తిని ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. దీంతో గుడిమళ్ల రవికుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అరుుతే రవికుమార్ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీఆర్‌ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం మరోసారి సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆఖరి నిమిషం వరకు రవికుమార్, దయాకర్ మధ్య అభ్యర్థిత్వ ఖరారు అంశం ఊగిసలాడగా చివరకు దయాకర్‌ను ఎంపిక చేశారు.
కలిసి వచ్చిన విధేయత..
సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన దయాకర్‌కు వివాదరహితుడిగా పేరుంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2008-11 మధ్య టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, 2011 నుంచి 2013 వరకు వర్ధన్నపేట నియోజకర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. మలిదశ ఉద్యమంలో పని చేస్తున్నప్పుడే అగ్నిమాపకశాఖలో ఉద్యోగం వచ్చినా వదులుకుని తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఇవన్నీ గుర్తించిన కేసీఆర్ ఆయనకు ఉప ఎన్నికల బరిలో అవకాశం కల్పించారు.
ప్రతిష్టగా మారిన ఎన్నికలు
తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య నియమితులయాయరు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఆయన బర్తరఫ్ కావడంతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి ఆ పదవి ద క్కింది. ఫలితంగా వ రంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ ఎస్‌లో అంతర్గత మార్పులతోనే ఈ ఎన్నిక జరుగుతుండటంతో పార్టీ విజయం తప్పనిసరని భావించిన కేసీఆర్.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు.