కాంగ్రెస్ నజర్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలు మొదలుపెడుతోంది. కాంగ్రెస్ సహజ శైలికి భిన్నంగా ఈ రెండు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. వరంగల్ లోక్‌సభ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సవాల్‌గా తీసుకుంటోంది. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. ప్రణాళిక రూపొందిస్తోంది.
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక విజయం లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు బాధ్యతలు తీసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య ఒక్కో నియోజకవర్గానికి పర్యవేక్షకులుగా ఉండనున్నారు.
ఆరు బృందాలుగా సమావేశాలుఅగ్రనేతల నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ ముఖ్య నేతలు ఆరు బృందాలుగా నియోజకవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతి బృందంలో ఆరుగురు ముఖ్యనాయకులు ఉంటారు. పర్యవేక్షకుడి నేతృత్వంలోని ఈ బృందాలు ఈ నెల 25న జిల్లాకు వస్తున్నారు. అదే రోజు ఒకేసారి ఒకే సమయంలో ఆయా అన్ని నియోజకవార్గల్లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయంపై శ్రేణులతో అభిప్రాయాలు తీసుకోనున్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించనున్నారు. వరంగల్ లోక్‌సభలో గెలుపు కోసం అనుసరించే వ్యూహం ఎలా ఉండానేది నియోజకవర్గాల వారీగా చర్చించనున్నారు.