పరికరాలపై సబ్సిడీ కోత | decreases the sprinkler subsidy | Sakshi
Sakshi News home page

పరికరాలపై సబ్సిడీ కోత

Published Sat, Aug 2 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

decreases the sprinkler subsidy

గజ్వేల్: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ.. సూక్ష్మనీటి వినియోగంతో ఆరుతడి పంటలు వేసుకుని గట్టెక్కాలనుకున్న రైతుల ఆశ అడియాస కానుంది. సూక్ష్యనీటి సేద్యపు పథకానికి అందిస్తున్న సబ్సిడీలో ప్రభుత్వం భారీ కోత విధించడమే ఇందుకు కారణం. గతంలో 90 శాతం సబ్సిడీపై అందించిన స్ప్రింక్లర్(తుంపర సేద్యం పరికరాలు)లను ప్రస్తుతం 50 శాతానికి మాత్రమే అందించాలని తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ పరిణామంతో రైతులు షాక్‌కు గురవుతున్నారు.
 
దశాబ్దాలుగా సాగునీటి కొరతతో అల్లాడుతున్న జిల్లా రైతాంగం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ప్రయోజనకరంగా వాడుకునేందుకు సూక్ష్మనీటి సేద్యపు పథకంపై ఆధారపడుతున్నారు. ప్రతిఏటా జిల్లాలో 10 వేల హెక్టార్లలో బిందు(డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్)లను బిగించుకుంటున్నారు. డ్రిప్‌ను ఏటా 7 వేల హెక్టార్లలో రైతులు వాడుతుండగా వాటికి ధీటుగా స్ప్రింక్లర్లను కూడా వాడుతున్నారు. స్ప్రింక్లర్లను ప్రధానంగా వేరుశనగ, ఉల్లిగడ్డ, మిర్చి, పొద్దుతిరుగుడు, పెసర, పత్తి, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలకు వాడుతున్నారు.
 
డ్రిప్ యూనిట్ విలువ రూ. లక్ష ఉండగా ఇందులో 90 శాతం సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నారు. పరికరాలు సుమారు హెక్టారుకు సరిపోతాయి. తుంపర సేద్యపు పరికరాల యూనిట్ విలువ రూ.19,600 ఉండగా దీనిని ప్రస్తుతం 50 శాతం సబ్సిడీపై మాత్రమే అందించగలమని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లుగా స్ప్రింక్లర్ల పంపిణీని నిలిపివేసిన ప్రభుత్వం ఈసారి నుంచి తిరిగి ఇవ్వడానికి నిర్ణయంచుకున్న తరుణంలో ఊరట చెందాల్సిన రైతులు.. సబ్సిడీలో భారీగా కోత విధించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
ఈసారి జిల్లాలో సూక్ష్మనీటి సేద్యపు పథకం కింద 6,500 హెక్టార్లలో డ్రిప్, మరో 2,900 హెక్టార్లలో తుంపర సేద్యాన్ని విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. తుంపర సేద్యానికి సంబంధించి మరో 10 వేల హెక్టార్లకు పెంచినా రైతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో తుంపర సేద్యపు పరికరాల కోసం వచ్చిన దరఖాస్తులు వేలల్లో పేరుకుపోయి ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
స్ప్రింక్లర్ల సబ్సిడీని తగ్గంచటం సరికాదు...
నేను మూడేళ్ల కిందట స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తుచేసుకున్న.. అయితే ఈసారి ఇస్తమంటున్నరు. మంచిదే కానీ, సబ్సిడీ 50 శాతం మాత్రమే ఇస్తమనడం దారుణం. నాలాంటి ఎంతోమంది రైతులకు ఈ పరికరాలు కావాలే. వానలు లేక...స్ప్రింక్లర్లతో పంటలు పండించుకుందామంటే సబ్సిడీతో కొర్రి పెడుతుండ్రు.
- రామచంద్రారెడ్డి, రైతు, ధర్మారెడ్డిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement