ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన...
మేడ్చల్: ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పడి వ్యవసాయానికి దూరమైన నగర శివారు ప్రాంత రైతులు ప్రస్తుతం సేద్యంపై దృష్టిసారించారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు మండలంలోని రాయిలాపూర్ యువ రైతులు.
కూరగాయలు, ఆకుకూరల పంటల సాగులో డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు. రాయిలాపూర్‌లో దాదాపు 200 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగవుతున్నాయి. గ్రామంలోని 100 మంది రైతుల్లో 50 మంది యువకులే ఉండటం.. వ్యవసాయంపై వారికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుంది.
కుటుంబ సభ్యులంతా కలిసి..
కూలీలపై ఆధారపడకుండా కు టుంబ సభ్యులే ఆకుకూరలను కట్టలుగా తయారు చేస్తున్నారు. కూరగాయలను కోసి గంపల్లో వేసి నగరంలోని వివిధ మార్కెట్లకు తరలిస్తున్నారు. చిన్న రైతులు చిరు వ్యాపారులకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. మరికొంత మంది మేడ్చల్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రైతేరాజు అని నిరూపిస్తున్నారు.