తప్పని జాప్యం? | Delay of GHMC elections | Sakshi
Sakshi News home page

తప్పని జాప్యం?

Published Tue, Jun 23 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

Delay of GHMC elections

- జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆలస్యం
- కొలిక్కిరాని కసరత్తు
- పూర్తి కాని ముసాయిదా
- సర్కిళ్లు.. జోన్ల పెంపు?
- ఎన్నికల నిర్వహణపై ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ కొత్త పాలక మండలి ఈ ఏడాది చివరిలోనూ కొలువుదీరే అవకాశం లేదా? ఎన్నికలు నిర్ణీత సమయంలో నిర్వహించడం కుదరదా? వివిధ రూపాల్లో ఎదురవుతున్న ఆటంకాలు ఈసందేహాలకు తావిస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు (డీలిమిటేషన్, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా వంటివి) పూర్తి చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 5వ తేదీలోపునే ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆ మేరకు మే మొదటి వారంలో డీలిమిటేషన్ ముసాయిదా.... జూన్ 10 నాటికి తుది జాబితా వెలువడాల్సింది.

కానీ జూన్ చివరి వారం వచ్చినా ముసాయిదా వెలువడలేదు. దీనికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఒక్కో డివిజన్‌కు సగటున 33 వేల జనాభా ఉండాలి. పది శాతం వరకు ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. ఈ మేరకు ఒక్కో డివిజన్ జనాభా 30,000 - 36,000 మధ్య ఉండవచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో 40 వేలకు పైగా జనాభా ఉంది. మరికొన్నిచోట్ల 22 వేలే ఉంది. ఇలాంటి వాటి మధ్య సమతుల్యం చేయడానికి...మిగిలిన జనాభాను ఇతర డివిజన్లలో కలపాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిహద్దుల వంటివి సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇలా జనాభా, సరిహద్దుల్లో ఇబ్బందులు గల డివిజన్లు దాదాపు 35 ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక డివిజన్‌ను ఒకే నియోజకవర్గంలో, ఒకే సర్కిల్‌లో ఉంచాలని ప్రయత్నిస్తున్నా... నగరమంతటా అది సాధ్యం కావడం లేదు. ఏ డివిజన్‌లోని పోలింగ్ కేంద్రాలు అక్కడే ఉంచాలని భావించినా.. అదీ సాధ్యం కావడం లేదు. అధికారులు వీటిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని విధాలా ఆలోచించి.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డివిజన్లపై నిర్ణయం తీసుకోనున్నారు.  
 
జోన్లు/సర్కిళ్ల పెంపుపై కసరత్తు
మరో వైపు జోన్లు పెంచాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించడంతో ఆ విషయంలోనూ అధికారులు పునరాలోచనలో పడ్డారు. జోన్లతో పాటే సర్కిళ్లనూ పెంచాలని యోచిస్తున్నారు. ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచాల్సిందిగా గతంలోనే ప్రసాదరావు కమిటీ సిఫార సు చేసింది. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియ ఒకడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. మరోవైపు తమకు అనుకూలంగా డీలిమిటేషన్ ఉండాలంటూ వివిధ రాజకీయ పార్టీల వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విభజన తర్వాత రిజర్వేషన్ల ఖరారుకు దాదాపు నాలుగు నెలలు పడుతుందని అంచనా. ఆ లెక్కన అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసి.. ఈసీకి నివేదించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదీ ప్రణాళిక.. అమలులో జాప్యం
కార్యాచరణ ప్రణాళిక మేరకు దిగువ పేర్కొన్న తేదీల్లోగా వివిధ పనులు పూర్తవ్వాలి
తేదీ :     కార్యక్రమం
మే 1    : ముసాయిదా
మే 7    : అభ్యంతరాల స్వీకరణ
మే 20    : ప్రభుత్వానికి నివేదిక
జూన్ 3    : ప్రభుత్వ ఆమోదం
జూన్ 10    : గెజిట్‌లో జాబితా
జూలై10    : పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల జాబితా


వీటి తర్వాత బీసీ ఓటర్ల గుర్తింపు, బీసీ ఓటర్ల జాబితా, బీసీ ఓటర్లతో ఎన్నికల తుది జాబితా, రిజర్వేషన్లలో భాగంగా  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు డివిజన్ల కేటాయింపు, తదితరమైనవి అక్టోబర్ తొలివారంలోగా పూర్తి చేయాలని... కొంత జాప్యం జరిగినా నెలాఖరుకుపూర్తి కాగలదని భావించారు. కానీ.. ముసాయిదానే వెలువడకపోవడంతో...ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement