చారిత్రక భవనానికి పూర్వవైభవం కలేనా..! | Delayed Pathergatti Building Repair Works Hyderabad | Sakshi
Sakshi News home page

చారిత్రక భవనానికి పూర్వవైభవం కలేనా..!

Published Fri, Oct 11 2019 1:08 PM | Last Updated on Fri, Oct 11 2019 1:08 PM

Delayed Pathergatti Building Repair Works Hyderabad - Sakshi

సుందరీకరణ నమూనా చిత్రం ,పత్తర్‌గట్టీలోని రాతి కట్టడాల మధ్య కొనసాగుతున్న వ్యాపార సముదాయాలు

చార్మినార్‌: నిజాం కాలంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన పత్తర్‌గట్టీని ఆధునీకరించడానికి జీహెచ్‌ఎంసీ అప్పట్లో ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం రూ.1.57 కోట్లను సైతం కేటాయించారు. ఆధునీకరణ పనులను స్థానిక వ్యాపారులకు వివరించడానికి అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు సభలు, సమావేశాలు నిర్వహించారు. పాదయాత్రలు, పరిశీలనలంటూ తిరిగారు. సహకరించమని వ్యాపారస్తుల వెంటపడ్డారు. నానా హడావుడి చేశారు. ఆతర్వాత అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పటి అధికారులు మారారు. ఇప్పుడున్న అధికారులకు ఆ విషయమే తెలియనట్లు కనిపిస్తోంది. దీంతో పత్తర్‌గట్టీలో కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి షాపింగ్‌మాల్స్‌ను నిర్మించారు. చార్మినార్‌ కట్టడానికి 200 మీటర్ల పరిధిలో పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాలన్నా, పున:నిర్మించాలన్నా ఆర్కియాలజీ అధికారుల అనుమతి తప్పని సరి. వీటిని బేఖాతరు చేస్తు కొంతమంది వ్యాపారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలను చేపట్టారు. ఇంకా అక్కడక్కడ పలు నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

2009 అక్టోబర్‌లోనే హడావుడి..
అప్పటి జీహెచ్‌ఎంసీ (ప్లానింగ్స్‌) అదనపు కమిషనర్‌ నీతూ ప్రసాద్, వర్క్స్‌ అదనపు కమిషనర్‌ ధనంజయరెడ్డి, సీసీ ముజాఫర్‌ హుస్సేన్, జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్‌ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి అక్టోబర్‌ 2009లో చార్మినార్‌లోని సనా ఫంక్షన్‌ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. పత్తర్‌గట్టీలో వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురు వ్యాపారులను ఈ సమావేశానికి పిలిచి పత్తర్‌గట్టీ ఆధునీకరణ పనుల విషయాన్ని వారికి వివరించారు. పెద్ద ఎత్తున సుందరీకరణ చేయనున్నందున వ్యాపారులు తమకు సహకరించాలని కోరారు. సాండ్‌ ట్రీట్‌మెంట్‌తో పాటు పత్తర్‌గట్టీలోని సైన్‌ బోర్డులన్నింటిటీ యూనిఫాంగా తీర్చిదిద్దడానికి చేపట్టనున్న చర్యలను అధికారులు వ్యాపారులకు వివరించారు. కొన్ని రోజులు తూతూమంత్రంగా కొనసాగిన ఈ పనులు అర్దాంతరంగా ఏళ్లతరబడి కనుమరుగయ్యాయి. మళ్లీ ఇటీవల మరో ఉన్నతాధికారి ప్రత్యక్షమై గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి రోడ్డులో కొన్ని సైన్‌ బోర్డులను తొలగించే ప్రయత్నం చేశారు. అంతే కారణాలేమిటో తెలియజేయకుండానే తిరిగి పనులను నిలిపి వేశారు. తిరిగి ఇటువైపు కన్నెత్తి చూసే అధికారులే కరువయ్యారు.

కాగితాలకే పరిమితం
పాతబస్తీలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించడానికి గతంలో జీహెచ్‌ఎంసీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు కార్యరూపం దాల్చకుండానే అటకెక్కాయి. 2009లో ఎంతో హడావుడి చేసినా అప్పటి జీహెచ్‌ఎంసీ అధికారులు పనులను పూర్తి చేయలేకపోయారు. తూతూమంత్రంగా జరిగిన ఈ పనులు, ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. చార్మినార్‌ను వారసత్వ ప్రాజెక్ట్‌ కింద అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2009లో రూ.9.94 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో పాతబస్తీలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించడంతో పాటు సుందరీకరణ చేపట్టడానికి ప్రణాళికను రూపొందించారు. పత్తర్‌గట్టీతో పాటు చార్‌కమాన్‌లను ఆధునీకరించడానికి సిద్ధమయ్యారు. అయితే చార్‌కమాన్ల ఆధునీకరణ పనుల్లో భాగంగా కేవలం మచిలీకమాన్‌ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. కాగా పత్తర్‌గట్టీ ఆధునీకరణ పనులు మాత్రం పూర్తిగా అటకెక్కాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement