పీవీ జిల్లా కోసం మళ్లీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. జిల్లాల పునర్విభజన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌లో ఐదో జిల్లాగా హుజూరాబాద్‌ను ఎంపిక చేసి, దివంగత ప్రధాని పీవీ నర్సింహరావు పేరుతో ప్రకటించాలని అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఇదే జరిగితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లితోపాటు హుజూరాబాద్‌ను ఏర్పాటుచేస్తే.. మిగిలిన కరీంనగర్‌తో ఐదు జిల్లాలు అయ్యేవి. హుజూరాబాద్ జిల్లాకోసం జేఏసీలుగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అప్పటిమంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సైతం హైపవర్ కమిటీ వేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీని కలిసి పీవీ (హుజూరాబాద్) జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల మనోభావాలు, సాధ్యాసాధ్యాలను వివరించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను ప్రకటించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యలలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తుండగా.. హుజూరాబాద్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన అఖిలపక్ష నేతలు గతంలో హైపవర్ కమిటీకి ప్రతిపాదించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరు, హుజూరాబాద్‌లో నాలుగు మండలాలున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ఇల్లందకుంట, హుస్నాబాద్‌రూరల్ మండలాలు కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 12 మండలాలు అవుతున్నాయి. హుజూరాబాద్‌కు సమీపంలోనే ఉన్న శంకరపట్నం మండలాన్ని పీవీ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. జమ్మికుంట మండలంలోని వావిలాలను కొత్త మండలం చేస్తే బాగుంటుందని సూచించారు. తద్వారా మొత్తం 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని రెండు నియోజకవర్గాల అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుత జనాభా దాదాపు ఆరు లక్షలు. ఆ సమయంలో కొత్తగా ప్రతిపాదించిన సిరిసిల్ల జిల్లానూ తొమ్మిది పాత, ఐదు కొత్త మండలాలతోనే ఏర్పాటు చేశారు. ఈ జిల్లా జనాభా 5.48 లక్షలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆరు లక్షల జనాభా, 14 మండలాలతో పీవీ జిల్లాను ఏర్పాటు చేయడం న్యాయబద్ధమని వివరించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, ఎల్కత్తురిని వరంగల్ అర్బన్, హుస్నాబాద్, హుస్నాబాద్‌రూరల్, అక్కన్నపేట తదితర మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు, కరీంనగర్ నియోకవర్గాలతో కరీంనగర్ జిల్లా మిగిలింది. ఇప్పుడు మళ్లీ మండలాల పెంపుద్వారాగానీ, కొత్త మండలాల ఏర్పాటు ద్వారానైనా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఓవైపు ప్రత్యక్ష ఆందోళనలు, మరోవైపు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పీవీ జిల్లా కోసం మళ్లీ ఉద్యమాలు..
హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, సింగిల్‌విండో డెరైక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు కోమటి సత్యనారాయణ, పచ్చిమట్ల రవీందర్, మ్యాక రమేష్, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు గతంలో ఉద్యమాలు చేశారు. మరోవైపు హుజూరాబాద్‌లో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ఆందోళనలను చేపట్టారు. ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలపగా.. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న 16 మండలాలకు తోడు సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కలిసిన కొన్నింటిని కలిపి హుజూరాబాద్‌ను కొత్తగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక తదితర మండలాల్లో ఈ జిల్లాకోసం ఆందోళనలు చేపట్టారు. మాజీ ప్రధాని పీవీ పేరిట హుజూరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీల ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ములుగు, నారాయణపేటతోపాటు హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని, అవసరమైతే ఆయా జిల్లాల్లో కలిపిన మండలాలను తిరిగి పునర్విభజన చేయాలని కోరుతున్నారు. ఇప్పుడున్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్తగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలను సీఎం పరిశీలిస్తున్న తరుణంలో హుజూరాబాద్ (పీవీ) జిల్లా ఏర్పాటు ఉద్యమం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
హుజూరాబాద్ ఆర్డీవోకు వినతి
హుజూరాబాద్‌రూరల్: పీవీ పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని సోమవారం హుజూరాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. హుజూరాబాద్ కు భౌగోళికంగా జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు చేయకపోతే ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయవాదులు సమ్మిరెడ్డి, ముక్కెర రాజు, సత్యనారాయణరెడ్డి, దొంత భద్రయ్య, మొలుగూరి సదయ్య, గుండేటి జయకృష్ణ, సత్యనారాయణ, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు
Comments
Please login to add a commentAdd a comment