హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ‘పార్టీ ఫిరాయింపులు– రాజ్యాంగ వ్యతిరేక పాలన’అనే అంశంపై శనివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఉందని, అందుకే అంతా మనవాళ్లే ఉంటే ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కోవచ్చని ఫిరా యింపులను ప్రొత్సహిస్తున్నారన్నారు. ‘నీకన్నా బలమైన నాయకుడు వస్తే, నీ పార్టీ వారిని కూడా ఇలానే కొనుగోలు చేస్తారు. అప్పుడు నీవు ఒంటరిగా నిలబడతావన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని కేసీఆర్‌కు హితవు పలికారు.
ఒత్తిడికి గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు...
భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికారాన్ని ఉపయోగించి, ఒత్తిడికి గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బును ఎమ్మెల్యేలను, ఓటర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి వ్యతిరేకంగా, ఫిరాయింపుల చట్టం పటిష్టతకు దేశవ్యాప్త ఉద్యమం తీసుకువస్తామని తెలిపారు. భారత రాజ్యాంగంపై చేయిపెట్టి ప్రమాణస్వీకారం చేసి అదే రాజ్యాంగాన్ని భస్మం చేసేలా వ్యవహరిస్తున్నారని గద్దర్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, వివిధ పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం
Published Sun, Mar 24 2019 3:06 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment