బాలింతలకూ నోటు కష్టాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఆర్.శాంతి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయకన్ తండాకు చెందిన ఈమె పదిరోజుల క్రితమే నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్న శాంతికి జననీ సురక్ష యోజన కింద రూ.1000 విలువ గల చెక్కును ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చారు. దానిని నగదుగా మార్చుకునేందుకు శాంతి శనివారం హాలియా ఎస్‌బీహెచ్‌కు వచ్చింది.
లైన్ చాంతాడంత పొడవు ఉండడంతో బ్యాంక్‌లో ఉన్న ఓ కుర్చీపై ఇలా నవజాత శిశువును పడుకోబెట్టి పడిగాపులు కాసింది. కాసేపటికే మరో బాలింత కూడా నవజాత శిశువును శాంతి పక్కనే పడుకోబెట్టి లైన్‌లో నిలబడింది. నగదు కొరత కారణంగా నాలుగు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు కనికరించడంతో మధ్యాహ్నం 3 గంటలకు చెక్కును మార్చుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు.