
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకునే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షలను డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 6 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలను ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత) నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, రంగారెడ్డి కలుపుకొని హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు తాము పనిచేస్తున్న జిల్లా మాత్రమే కాకుండా అదనంగా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపింది. ప్రాధాన్యతల ఆధారంగా జిల్లా కేంద్రాలు, హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.