50 కిలోల బస్తా 46.995 కిలోలు చూపిస్తోన్న దృశ్యం
పై చిత్రం పద్మాజీవాడి రేషన్ షాపులోనిది.. ఎల్‌ఎంఎస్ పాయింట్ నుంచి దుకాణానికి సరఫరా అయిన బియ్యం తూకం వేయగా.. 50 కిలోల బస్తాలో మూడు కిలోల తరుగు వచ్చింది. ప్రతి నెల ఇలాగే బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్ కిషన్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
సదాశివనగర్: ఆహార భద్రతాకార్డులు కలిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో గోల్‌మాల్ జరుగుతోంది. గోదాముల నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం సంచుల్లో.. బస్తాకు మూడు నాలుగు కిలోల తరుగు వస్తోంది. దీంతో రేషన్ డీలర్లు నష్టపోతున్నారు.
నిబంధనల మేరకు ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం ఉండాలి.
హమాలీలు బస్తాలను లారీలలో ఎత్తేముందు ఒక్కో బస్తాను గోదాంలో తూకం వేస్తారు. తూకం తక్కువ ఉంటే బస్తాలో తిరిగి ఆ మేరకు బియ్యాన్ని కలిపి బస్తాలు కుట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో బస్తాలో ఒక్కో తీరుగా బియ్యం తూకం వస్తున్నాయని డీలర్లు పేర్కొంటున్నారు. బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు ఉంటోందంటున్నారు.
యంత్రంతో లెక్కపక్కా..
ఒక్కో చౌకధరల దుకాణంలో లబ్ధిదారుల వివరాలను ముందుగానే యంత్రానికి అనుసంధానం చేయడంతో వారు చౌకధరల దుకాణంలో బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు నమోదు చేయగానే వారికి అందాల్సిన బియ్యం వివరాలను మిషన్ తెలియజేస్తుంది. బియ్యం తూకం వేసే సమయంలో ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివరాలను చూపించదు. ఈ రకంగా తూకం వేస్తే ఒక్కో బస్తాకు మూడు కిలోలపైనే తక్కువగా వస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
నష్టపోతున్నాం..
ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లో తరుగు వస్తోంది. బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు తక్కువ వస్తున్నాయి. దీంతో నష్టపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.
– కిషన్‌రావు, రేషన్ డీలర్, పద్మాజీవాడి
తరుగు లేకుండా చూస్తాం
గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సరైన తూకంతో బియ్యం సరఫరా చేయాలని సూచించాం. గోదాంలో తూకం వేసిన తర్వాతే డీలర్లకు అందేలా చర్యలు తీసుకుంటాం.
– అమీన్‌సింగ్, తహసీల్దార్, సదాశివనగర్
Comments
Please login to add a commentAdd a comment