సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న డీజీపీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం డీజీపీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ఇకపై లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటవ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కిరాణా షాపులను మధ్యాహ్నానికి మూసివేయాలని పలుచోట్ల పోలీసులు కోరారని సమాచారం.
ఇక వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకుల పనివేళలనూ పరిమితం చేయనున్నట్లు తెలిసింది. అన్ని సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు భౌతికదూరం అమలు కాకపోతే.. వారిపై చర్యలు తప్పవన్న డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరికల ప్రభావం మంగళవారం స్పష్టంగా కనిపించింది. వ్యాపారులంతా తమ వద్దకు వచ్చే వారిని సర్కిల్స్‌లోనే నిలబడాలని కోరుతున్నారు. అలాగే పెట్రోల్ బంకుల పనివేళలను మరింత పరిమితం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎవరికైనా వైద్యపరమైన అత్యవసరాలు ఏర్పడితే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరుతున్నారు.
మంగళవారం ఉదయం నుంచి 3 కిలోమీటర్ల నిబంధనను ఉల్లంఘిస్తూ సరైన కారణం లేకుండా బయటికి వచ్చిన వారి వాహనాలను ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు పెట్టారు. మంగళవారం ఒక్కరోజే 1,630 కేసులు నమోదు కావడంలో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులు 51,100కు చేరుకున్నాయి. గడిచిన నెలరోజుల్లో 21,000 మందిని అరెస్టు చేశారు. ఇప్పటివరకూ 1,21,000 వాహనాలు సీజ్ చేయగా.. మంగళవారం మరో 2,600 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యవసరమైతే తప్ప పాసులు ఇవ్వడం లేదు. పలు చోట్ల చెక్‌పోస్టులను ఉన్నతాధికారులే స్వయంగా పరిశీలిస్తున్నారు.
చదవండి: కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా!
Comments
Please login to add a commentAdd a comment