
పొన్నాల మా భూములు ఆక్రమించారు
⇒ అసెంబ్లీ హౌస్ కమిటీకి దళితుల ఫిర్యాదు
⇒ భూములను పరిశీలించిన హౌస్ కమిటీ
మడికొండ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌లోని తమ అసైన్డ్‌భూములను తిరుమల హేచరీస్ కంపెనీ పేరిట పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారని స్థానిక దళితులు ఫిర్యాదు చేశారు. ఈ భూములను అసెంబ్లీ హౌస్ కమిటీ సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిని కలిసిన స్థానిక దళితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 1971లో రాంపూర్‌కు చెందిన సర్వేనంబర్ 337, 339లోని 8 ఎకరాల 27 గుంటలను అదే గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం అసైన్ చేసింది.
తర్వాత పరిశ్రమల కోసమని 1987లో ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఈ భూమిని ఏపీఐఐసీ తిరుమల హేచరీస్‌కు అప్పగించారు. అయితే, తమ భూములను తిరుమల హేచరీస్ పేరిట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అక్రమ పద్దతిలో స్వాధీనం చేసుకున్నారని దళితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి. 1994, 1997లో తిరుమల హేచరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2005లో తిరుమల హేచరీస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాంపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రూబేన్, సండ్ర కొమురయ్య, చిట్యాల పురుషోత్తం, సండ్ర కనుకయ్య వారసులు సీఎం కేసీఆర్‌ను కలసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన అసైన్డ్, దేవాలయ, సొసైటీ భూములపై అధ్యయనానికి ఆసెంబ్లీలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములపై ఏర్పాటైన కమిటీ మొదటిసారిగా తిరుమల హేచరీస్ భూములు పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.