రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకోని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రట్టు చేశారు. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన సలీమ్ ఖాన్(37), జాఖీర్ ఖాన్(35), పప్పు యాదవ్ (20), అనీఫ్ ఖాన్ (25), లతీఫ్ ఖాన్(30)లు నగరానికి వలస వచ్చి శాస్త్రీపురంలో ఉంటు నేరాల బాట పట్టారు.
గత కొంత కాలంగా రోడ్లపై ఆగి ఉన్న లారీలలోంచి డిజిల్‌ను దొంగిలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కాగా వీరి దృష్టి కాటేదాన్ పారిశ్రామిక వాడకు వచ్చే లారీలపై పడింది. ఎవరికి అనుమానం రాకుండా స్కార్పియో వాహనంలో తిరుగుతూ గత కొంత కాలంగా రోడ్లపై పార్క్ చేసి ఉన్న లారీల నుంచి డిజిల్ దొంగిలిస్తున్నారు.
నిత్యం ఈ కేసులు పోలీసుల దృష్టికి వస్తుండడంతో డిజిల్ చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ లారీ నుంచి ముఠా సభ్యులు డిజిల్ చోరీ చేస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 200 లీటర్ల డిజిల్‌తో పాటు ఏపీ 07 ఏబీ 8480 నెంబర్ గల స్కార్పియో వాహనాన్ని స్వాదీనం చేసుకోని సీజ్ చేశారు.