కరోనా చదువులు! | Dilemma About Academic Year For Schools In Telangana Due To Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా చదువులు!

Published Tue, Jul 21 2020 1:10 AM | Last Updated on Tue, Jul 21 2020 9:58 AM

Dilemma About Academic Year For Schools In Telangana Due To Coronavirus - Sakshi

కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. స్కూళ్లు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యార్థుల సంగతి ఏమిటన్న దానిపై విద్యాశాఖ ఎటూ తేల్చలేకపోతోంది. ఈలోగా కార్పొరేట్, సెమీ కార్పొరేట్‌ స్కూళ్లు ఆన్‌లైన్‌ బోధన అంటూ తరగతులను ప్రారంభిం చేశాయి. జీహెచ్‌ఎంసీలో ఆన్‌లైన్‌ తరగతులు జోరందుకోవడంతో యాజ మాన్యాలు ఫీజు వసూళ్లపై దృష్టి పెట్టాయి. మరోవైపు కొన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర ప్రముఖ పాఠశాలలు, సాధారణ ప్రైవేటు స్కూళ్లు ఇంకా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటన్న దానిపై ఇంతవరకు ఏ నిర్ణయమూ లేదు. ఈ పరిస్థితుల్లో వీడియో పాఠాలతో ప్రత్యామ్నాయ విద్యా బోధన సాధ్యం అవుతుందా? దాంతో ఎంతమేరకు ప్రయోజనం చేకూరుతుంది. ఆన్‌లైన్‌ బోధన, ప్రత్యక్ష బోధన లోటును పూడ్చగలుగుతుందా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాల్లో ఇంటర్నెట్‌ సమస్యలు ఆన్‌లైన్‌ బోధనకు ఆటంకంగా మారుతుండటంతో విద్యా బోధన ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వానాకాలం చదువుల్లా తయారైన కరోనా చదువులు, విలవిల్లాడుతున్న పాఠశాల విద్యపై సాక్షి ప్రత్యేక కథనాలు.

సాక్షి, హైదరాబాద్‌ : ‘రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారంతా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. రోజూ పని చేసుకుంటే తప్ప జీవనం సాగించలేని ఈ కుటుంబాలకు తమ ఇళ్లలో కరెంటు వినియోగించుకున్నం దుకు వచ్చే బిల్లు, సాధారణ ఫోన్‌ వినియోగానికి నెలకు అయ్యే ఖర్చు భరించడమూ గగనమే. కరోనా ఆడుతున్న వికృత క్రీడ నేపథ్యంలో పాఠశాలలు తెరిచే పరిస్థితి లేనందున వారి పిల్లలు ఆన్‌లైన్‌లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పుణ్యమాని అలాంటి కుటుంబాల్లో ఇప్పుడు ఎల్‌ఈడీ టీవీలు, కంప్యూ టర్లు, స్మార్ట్‌ఫోన్‌లు అవసరమవుతున్నాయి.

వేలాది రూపాయలు ఖర్చయ్యే ఈ పరికరాలను కొనుగోలు చేయడం ఈ పేద, మధ్య తరగతి కుటుంబాలకు కరోనా తెచ్చిపెట్టిన మోయలేని భారం. మరోవైపు 10,756 ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థు ల్లోనూ 70% మంది సాధారణ, మధ్యతరగతి కుటుంబా లకు చెందిన పిల్లలే. సాధారణ, ప్రైవేటు ఉద్యోగుల పిల్లలూ ఉన్నారు. పిల్లలకు ఏదోలా మంచి చదువులు చెప్పించాలనే ఆలోచనతో పైసాపైసా కూడబెట్టుకుని, అవసరమైతే అప్పులు చేసి మరీ వేల రూపాయల స్కూల్‌ ఫీజులు చెల్లిస్తున్న వీరిపై ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ పాఠాలంటూ భారం మోపాయి. విద్యార్థులు విన్నా వినకపోయినా పాఠాలు చెబుతామంటూ ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకూ కష్టాలు తప్పడం లేదు.

ఆన్‌లైన్‌ పాఠాల కోసం కొత్త ఫోన్లు, కంప్యూటర్లు కొనుగోలు చేయలేక, ప్రైవేటు విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించలేక వారు అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల బాధలు అలా ఉంటే... అసలు విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభించాలో కూడా ప్రభుత్వం ఇదమిత్థంగా నిర్ణయించుకోలేకపోతోంది. ఈ విద్యా సంవత్సరంలో అసలు పాఠశాలలు తెరుస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కీ ఎక్కని వీడియో పాఠాలు, వాటి కోసం తల్లిదండ్రుల తిప్పలు, ఏం చేయాలో పాలుపోని ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలకు పూర్తిగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పామో లేదో అర్థం కాక టీచర్లు... ఇలా అంతటా అయోమయం... గందరగోళం. కరోనా మహమ్మారి రాష్ట్ర విద్యారంగాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పాఠశాల విద్యను మరింత గందరగోళంలో పడేసింది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య అనివార్య అంతరాలనూ సృష్టిస్తోంది. 

ఫీజుల కోసం పాఠాలు
కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకంటూ తెరపైకి వచ్చిన ఆన్‌లైన్‌ తరగతుల గురించే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. గతంలో వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే పరిమితమైన ఈ ఆన్‌లైన్‌ తరగతులు పూర్వ ప్రాథమిక విద్యలోని ఎల్‌కేజీ వరకు వచ్చేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కార్పొరేట్‌ స్కూళ్లు, సెమీ కార్పొరేట్‌ స్కూళ్లు ఈ ఆన్‌లైన్‌ క్లాసుల విషయంలో దూసుకుపోతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేసుకునేందుకు జూన్‌ నుంచే తరగతులు ప్రారంభించాయి. ఈ క్లాసులు యాక్సెస్‌ అయ్యేందుకు పాస్‌వర్డ్‌ ఇవ్వాలన్నా వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు అసలు ఆ పాఠాలు అర్థం అవుతున్నాయా? లేదా? అన్నది ఓ పెద్ద ప్రశ్న. అయినప్పటికీ ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాం కాబట్టి ఫీజులు చెల్లించడంటూ తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన కార్పొరేట్, సెమీ కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలైతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి ఫీజు అగ్రిమెంట్‌ చేసుకొని మొదటి టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచాయి. అంతేకాదు యాజమాన్యాలు ఆ ఫీజల వసూలుకు ప్రిన్సిపాళ్లు, క్లాస్‌ టీచర్లకు టార్గెట్లను విధించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫీజులను చెల్లించేలా చూడాలని, అప్పుడే ఇప్పుడు ఇస్తున్న సగం జీతం ఇస్తామంటుండటంతో టీచర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. లేకపోతే జీతం ఇవ్వమని తెగేసి చెబుతుండటంతో టీచర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సార్‌.. కొంత ఫీజైనా చెల్లించండి.. అంటూ రోజూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బతిమిలాడుకోవాల్సిన దుస్థితిలో పడ్డారు. 

కాగా జీహెచ్‌ఎంసీయేతర పట్టణాల్లో కొన్ని ప్రముఖ పాఠశాలలు, సాధారణ పాఠశాలలు ఇంకా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించలేదు. సర్కారు బడుల్లో చదువులు ఎలా చెప్పాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని తాము ఎవరికీ చెప్పలేదని చెపుతోంది. కానీ, కొన్ని పాఠశాలల్లో ప్రారంభమయిన ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా విద్యార్థుల మధ్య అంతరాలు ఏర్పడే ప్రమాదం నెలకొంది. మరోవైపు ఆన్‌లైన్‌ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని విద్యావేత్తలంటున్నారు. విద్యార్థులు ఇంట్లో శ్రద్ధగా ఆన్‌లైన్‌ పాఠాలు వినడం లేదని, ముఖ్యంగా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలకు అసలు ఆన్‌లైన్‌ అంటేనే తెలియడం లేదని, వారు ల్యాప్‌టాప్‌లు ముందు పెట్టుకుని, స్మార్ట్‌ ఫోన్లలో చూస్తూ పాఠాలు నేర్చుకోలేకపోతున్నారని ఇప్పటికే కొన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. రికార్డెడ్‌ వీడియో పాఠాలు పెద్దగా విద్యార్థులకు ఉపయోగపడడం లేదని, లైవ్‌ తరగతులను విద్యార్థులు సరిగా వినడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ పాఠాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతుల వల్ల చిన్న పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్‌) సంస్థ ఇదివరకే పేర్కొంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేజీ నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌ పాఠాలను నిషేధించింది కూడా. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్, వీడియో, టీవీ పాఠాల విషయంలో ఏం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతుపట్టడం లేదు. 

మరేం చేయాలి?
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఓవైపు విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉండడం, మరోవైపు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాష్ట్రంలోని ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇప్పటికే నెల రోజులు నష్టపోగా, అసలు పరిస్థితి ఎప్పుడు గాడిలో పడుతుందనేది ఊహించడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ముందు కూడా ఆన్‌లైన్‌ లేదా టీవీ పాఠాలే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ పాఠాలు బోధించే వ్యవస్థ సక్రమంగా లేదు. మరోవైపు ఆ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కుటుంబాలకు కూడా స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో టీశాట్, డీడీ యాదగిరి, నిఫుణ వంటి చానెళ్ల ద్వారా రాష్ట్రంలోని అందరు విద్యార్థులకు పాఠాలు బోధించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కానీ టీవీ పాఠాలు విద్యార్థుల మస్తిష్కాల్లోకి ఏ మేరకు వెళతాయన్నది సందేహాస్పదమే. ఇప్పుడు కొన్ని పాఠశాలలు ప్రారంభించిన ఆన్‌లైన్‌ పాఠాలతో పెద్దగా ప్రయోజనం లేదని సర్వేలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఎదురుగా కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పడమే మంచిదని, వేరే మార్గమే లేదని, ఏ మార్గంలో వెళ్లినా విద్యార్థులకు ఉపయోగం ఉండదని విద్యావేత్తలు పేర్కొంటుంటడంతో రాష్ట్రంలో విద్యారంగం ‘ఆన్‌లైన్‌’కూడలిలో నిలిచిపోయింది. 

నిఫుణులు ఏమంటున్నారంటే..
ప్రత్యక్ష బోధనతోనే ప్రయోజనం

ఆన్‌లైన్‌ పాఠాలు, వీడియో పాఠాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. విద్యార్థులు శ్రద్ధ పెట్టి వినలేరు. చిన్న పిల్లలైతే ఆ పాఠాలను సొంతంగా అర్థం చేసుకునే స్థాయి ఉండదు. మనది పిల్లల ముఖం చూస్తూ బోధించే విద్యా విధానం. అతని ముఖం చూస్తూ అర్థం అవుతోందా? లేదా? అని పరిశీలించి బోధన స్వరూపాన్ని మార్చి చెప్పే పద్ధతి. వీడియో పాఠాలతో అది సాధ్యం కాదు. ఆన్‌లైన్‌ బోధనలో కూడా కష్టమే. పాఠశాల స్థాయిలో విద్యార్థులను విభజించి బ్యాచ్‌లుగా చేసి, భౌతిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చోబట్టి బోధిస్తే ప్రయోజనం ఉంటుంది.
– విద్యావేత్త చుక్కా రామయ్య

ఆన్‌లైన్‌ బోధనను ఎక్కువ సమయం వినలేరు
ప్రాథమిక స్థాయిలో ఆన్‌లైన్‌ బోధన అమలు చేయాలంటే ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే ఉండాలి. చిన్న పిల్లల సైకాలజీ ప్రకారం తరగతి గదిలోనూ 45 నిమిషాల పీరియడ్‌లో కేవలం 10 నుంచి 14 నిమిషాలు మాత్రమే శ్రద్ధ పెడతారు. అంతకుమించి ఎక్కువ సమయం శ్రద్ధతో పాఠం వినలేరు. ప్రాథమిక స్థాయిలో పాఠాలను ఆటలు, పాటలు, సంభాషణ రూపంలోకి మార్చి చెబితేనే ఉపయోగం ఉంటుంది. 6 నుంచి 10వ తరగతి వారికి ఇంటరాక్షన్‌ విధానంలో బోధన లేకపోతే ఉపయోగం పెద్దగా ఉండదు.
– ఆనందకిషోర్, ఎస్‌సీఈఆర్‌టీ రిటైర్డ్‌ డైరెక్టర్‌

ఒకటీ రెండు నెలల తరువాత షిఫ్ట్‌ పద్దతి మేలు
ఒకటో తరగతి నుంచి 5 తరగతులకు ఇప్పుడే బోధన అవసరం లేదు. 6 నుంచి 10 తరగతుల ప్రభుత్వ విద్యార్థులకు టీవీల ద్వారా లేదా ట్యాబ్‌లు ఇచ్చి ఆన్‌లైన్‌ ద్వారా బోధించాలి. ఒకటీ రెండు నెలల తరువాత విద్యార్థులను బ్యాచ్‌లుగా ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్‌ పద్ధతిలో అదీ 6 నుంచి 10 తరగతులకే బోధన చేపట్టాలి. వీలైతే మండల యూనిట్‌గా మండలంలోని టీచర్లను విభజించి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే 6 –10 తరగతుల విద్యార్థులకు బోధన చేపట్టేలా చేయాలి.
– డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి
విద్యా సంవత్సరం అలస్యమైంది. విద్యా వి«ధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యక్ష బోధన వద్దనుకుంటే ముందుగా వర్క్‌షీట్లను రూపొందించి విద్యార్థులకు అందించాలి. వాటిపై టీవీల ద్వారా వీడియో పాఠాలను అందించడం ఉత్తమం. ఉన్నత తరగతులకు వీలైతే ఆన్‌లైన్‌ పాఠాలను బోధించాలి. టీచర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలి.
– సదానంద్‌గౌడ్, ఎస్టీయూ అధ్యక్షుడు

సిలబస్‌ తగ్గింపు ప్రధానమే
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులపై భారం తగ్గించేలా సిలబస్‌ను కుదించాలి. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలి. 6 నుంచి 10 తరగతులకు ఆ¯Œన్‌లైన్‌ బోధనను చేపట్టాలి. ట్యాబ్‌లు ఇవ్వడం ఆర్థిక భారం అనుకుంటే వీడియో పాఠాలనైనా టీశాట్, డీడీ యాదగిరి వంటి ఛానెళ్ల ద్వారా ప్రసారం చేయాలి. విద్యార్థులు పూర్తిగా ఖాళీగా ఉండకుండా చూడాలి.
–శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్‌ అధ్యక్షుడు

టీవీల ద్వారా పాఠాలను బోధించాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్లు ప్రారంభించడం కష్టమే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీలైతే స్కూళ్లు ప్రారంభింవచ్చు. లేదంటే టీవీల ద్వారా వీడియో పాఠాలు అందిస్తే ఉపయోగం ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో టీవీలను ఏర్పాటు చేసి పాఠాలను ప్రారంభించాలి. పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లలో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన బోధనను చేపట్టాలి.
– చావ రవి, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement