కేసును నీరుగార్చే కుట్ర
♦ పోలీసులు పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారా?
♦ అంజి మైనరంటూ చేసిన ప్రకటనపై అనుమానాలు
♦ అతడు వివాహితుడు.. భార్య నిండు గర్భవతి
♦ బాధితురాలు కోచింగ్ సెంటర్ విద్యార్థి కాదనడంపైనా చర్చ
♦ యువతి మాటలకు, పోలీసుల వివరణకు పొంతన లేని వైనం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారా? తమపై మచ్చ పడకుండా ఉండేందుకు కేసును పక్కదారి పట్టిస్తున్నారా..? ఈ నెల 10న బాధితురాలు అత్యాచారానికి గురయ్యే సందర్భంలో ఆమె స్నేహితురాలు వెంటనే సమాచారమిచ్చినా పోలీసులు స్పందించలేదా..? జరుగుతున్న పరిణామాలు, బాధితులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ నిజమేననే అనుమానం కలుగుతోంది. ఆదివారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలకు, బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన మాటలకూ పొంతన కుదరడం లేదు. డీఎస్పీ వెల్లడించిన అంశాల్లో మూడు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి. అవేమిటంటే...
వారు పోలీసు శిక్షణ పొందడం లేదట
బాధితురాలు, అత్యాచారానికి పాల్పడిన యువకులు వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్ ఉద్యోగాల శిక్షణా కేంద్రం అభ్యర్థులు కాదని డీఎస్పీ పేర్కొన్నారు. తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మాత్రమే అక్కడికి వచ్చేవారన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను బాధితురాలు తీవ్రంగా ఖండించారు. వీణవంక పోలీసులు నిర్వహించే కోచింగ్ సెంటర్‌కు తాను రెగ్యులర్‌గా వెళ్లేదానని చెబుతూ సంబంధిత దరఖాస్తు పత్రాన్ని మీడియాకు చూపించారు.
10న ఘటన.. 24న ఫిర్యాదు?
ఈ నెల 10న అత్యాచారం జరిగితే 24న ఫిర్యాదు చేశారని డీఎస్పీ వెల్లడించారు. ఫిర్యాదు చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించామన్నారు. దీన్ని కూడా బాధితురాలు తప్పుపట్టారు. తనను కోచింగ్ సెంటర్ నుంచి బలవంతంగా తీసుకెళ్లే సమయంలోనే తన స్నేహితురాలు వీణవంక పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారని తెలిపింది.
అంజి విద్యార్హత పత్రాలు మాయం!
నిందితుల్లో రాకేశ్, అంజి అలియాస్ అంజయ్య మైనర్లని డీఎస్పీ తెలిపారు. వారిని జువైనల్ హోంకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అంజి వివాహితుడు. ఆయన భార్య లావణ్య నిండు గర్భవతి. ఇంటర్ పూర్తి చేశాక మధ్యలో మూడేళ్లపాటు చదువు మానేశాడని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మళ్లీ జమ్మికుంటలో డిగ్రీలో చేరాడని పేర్కొన్నారు. స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి అంజికి 21 ఏళ్లకుపైనే ఉంటాయని తెలుస్తోంది. అంజి వాస్తవ వయసును అంచనా వేసేందుకు మీడియా ఆయన విద్యార్హత పత్రాల కోసం అన్వేషించగా.. పోలీసులు వాటిని తీసుకెళ్లారని తెలిసింది. మరోవైపు వీణవంక ఎస్‌ఐ కిరణ్‌పై గతంలో పలు ఆరోపణలున్నాయి. కిరణ్‌పై చల్లూరు గ్రామస్తులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. కిరణ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదివారం పెద్దఎత్తున ఆందోళన చేశారు.
ఈటలను అడ్డుకున్న గ్రామస్తులు
చల్లూరులో బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి ఈటలను గ్రామస్తులు అడ్డుకున్నారు. డీఎస్పీ, సీఐ, ఎసై ్సలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పోలీసులపై వస్తున్న విమర్శలపైనా విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. షీ టీంలను హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మండలాలకు విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు.