సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి పొగలు గక్కుతోంది. టికెట్ రాని నేతలు ఎదురు తిరుగుతున్నారు. కారును వదిలి హస్తం, కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని నమ్ముకుంటే మట్టే మిగిలిందనే కసితో ఉన్న ఇంకొందరు నేతలు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ తూర్పు, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో రెబల్స్ రెడీ అయ్యారు.’ అని ఇంటెలిజెన్సీ విభాగం ‘గులాబీ’ అధినేత కేసీఆర్‌కు ఉప్పందించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
స్వతంత్రులతోనే మోసం....
భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, ములుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలబడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజారపు ప్రతాప్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గం, ములుగులో చందూలాల్ వ్యతిరేక కూటమి తో భారీ ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ పసిగట్టినట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని, వీళ్ల చర్యల మూలంగా టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
భూపాలపల్లిలో భారీ సంక్షోభం..
భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారికి టికెట్ కేటాయించిన రోజు నుంచే గండ్ర సత్యనారాయణరావు తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. తనకు సహకరించాలని ప్రచారం సైతం మొదలుపెట్టారు. గండ్ర సత్యనారాయణకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని.. భారీ ఎత్తున ఓట్లు చీల్చే ప్రమాదం ఉందని.. ఇది కాంగ్రెస్‌కి మేలు చేస్తుందని.. ఇప్పటికే ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా నష్టం జరిగిందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది.
రాజయ్య నైతికతపై దాడులు..
స్టేషన్ ఘన్‌పుర్‌లో డాక్టర్ రాజయ్యపై అసమ్మతి సెగలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజారపు ప్రతాప్ తిరుగుబాటుతో రాజుకున్న అసమ్మతిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచర వర్గం అందుకుంది. రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్‌తో ఇప్పటికీ ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రోజుకో చోట ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. అవినీతి, కమీషన్ల దందా ఉన్న రాజయ్యకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. సోషిల్ మీడియా మాధ్యమంగా రాజయ్య నైతికతపై దాడులకు తెగబడుతున్నారు. 20 రోజుల కిందట ఒక మహిళతో సెల్‌ఫోన్లో చేసిన సంభాషణను వైరల్ చేశారు. దళిత ఉప జాతులను ఉద్దేశించి మాట్లాడినట్టు రాజయ్య స్వరాన్ని పోలిన మాటల వీడియో తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ములుగులో ముసలం..
ములుగు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాజీ మంత్రి చందూలాల్‌కు ఇచ్చిన టికెట్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మొదట అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు గోవింద్ నాయక్ లేవనెత్తిన తిరుగుబాటుకు ఇతర ద్వితీయ శ్రేణి నాయకత్వం జత కలిసింది. ములుగు జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, మంగపేట జెడ్పీటీసీ సభ్యుడు సిద్ధంశెట్టి వైకుంఠంతోపాటు పలువురు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌కుగానీ, మరెవరికైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 మంది టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు మంగపేటలో సమావేశమై చందూలాల్‌కు సహకరించబోమని తీర్మానించారు. వాళ్ల ఆధ్వర్యంలో ఇటీవల ములుగులో భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు. చందూలాల్‌కు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుపించుకుని కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని, లేకుంటే స్వతంత్రంగా బరిలో నిలబడుతామని వారు హెచ్చరించారు.
ఆ నాలుగు నియోజకవర్గాల్లో ...
పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థిత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లితో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శిస్తున్నారు. ఇటీవల తక్కెళ్లపల్లి మద్దతుదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తన మద్దతుదారులతో కలిసి గ్రామల్లో తిరుగుతున్నారు.
మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడిన మోహన్‌లాల్ తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎక్సైజ్ అధికారిగా పనిచేస్తున్న ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టికెట్ రాకపోవడంతో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత వర్గం కూడా శంకర్ నాయక్‌కు సహకరించే యోచనలో లేనట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.
ఇక డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన సత్యవతి రాథోడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ.. ఎంత కాలం ఇలా మౌనంగా ఉందామని, తిరిగి సొంత గూటికి వెళ్లిపోదామని కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు గుర్తించారు. జనగామ నియోజకవర్గంలో కూడా ఓ వర్గం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది.
నష్టం జరగబోతోంది..!
Published Sun, Sep 30 2018 12:45 PM | Last Updated on Wed, Oct 3 2018 1:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment