సాక్షి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలను తీసుకెళ్లే విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాగుతున్న ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి.రాజయ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పోటీపోటీగా తేదీలను ఖరారు చేసి, పోస్టర్లు, ఫ్లెక్సీలను విడుదల చేయడం టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కాళేశ్వరం బాట పట్టించే క్రమంలో వేర్వేరు తేదీలను ఖరారు చేయడం వివాదస్పదమవుతోంది.
ఆది నుంచి ప్రత్యర్థులే..
ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రెండు గ్రూపుల ప్రతినిధులుగా ఉన్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మొదటి నుంచి ప్రత్యర్థులే. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, కడియం శ్రీహరి ప్రత్యర్ధులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఇరువురు నేతలు, వారి అనుచరుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణమే నడిచేది. 2014 ఎన్నిక ల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు.
ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగిన రోజుల్లో కడియం శ్రీహరి అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆరు నెలల తర్వాత వివిధ కారణాలతో రాజయ్యను తొలగించగా.. అదే పదవిని సీఎం కేసీ ఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టారు. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నా.. ఈ ఇద్ద రి మధ్య విభేదాలకు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎంగా కొనసాగినన్నిరోజులు కడియం శ్రీహరి నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలకు ముందు కడి యం వర్గీయులు టీఆర్‌ఎస్ కార్యకర్తల ఆవేదన సభతో కార్యక్రమాలను నిర్వహించారు. ఆ ఆవేదన సభలు కూడా ఇరువర్గాల మధ్య విభేదా లను మరింతగా పెంచాయి. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. రాజయ్యనే రుగా వెళ్లి తనకు సహకరించాలని కడియం శ్రీహరిని కలి సి వేడుకున్నారు కూడా. అయితే, ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేయగా రాజయ్య విజయం సాధించారు. ఎన్నికల సమయం నుంచి రెండు వర్గాల మధ్య అంతా బాగానే ఉన్నట్లుగా అనిపించినా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలతో పొరపొచ్చాలు వెలుగుచూశాయి. టిక్కెట్లు కేటాయించిన విధానం ద్వారా రాజయ్య పూర్తిగా కడియం శ్రీహరి అనుచరులకు చోటు కల్పించలేదన్న వాదన బలపడింది. ఆ తర్వాత నుంచి మళ్లీ గ్రూపుల పోరు యథాతధమైంది.
మరోసారి బహిర్గతం
ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు. ఇలా ఇద్దరి నేతల మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య అంతరాన్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. ముందుగా కడియం శ్రీహరి ఈనెల 4న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కాళేశ్వరం సందర్శన యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అంతకుముందే అంటే 1వ తేదీనే కాళేశ్వరం సందర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకే నియోజకవర్గం నుంచి రాజయ్య, శ్రీహరి వేర్వేరు తేదీల్లో కాళేశ్వరం యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment