
సాక్షి, హైదరాబాద్: తీరొక్క పూలతో బతుకమ్మలు.. తీరొక్క వన్నెలతో బతుకమ్మ చీరలు.. ఇక తెలంగాణ పల్లెలు కళకళలాడనున్నాయి. వందరకాల చీరల అందం.. ఆడపడుచుల కళ్లలో ఆనందం.. బతుకమ్మ చీరల పంపిణీ సోమవారం నుంచి షురూ కానుంది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీమంత్రి కె.తారకరామారావు నల్లగొండ జిల్లాకేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక మూలంగా సూర్యాపేట జిల్లాలో ఎన్నికలకోడ్ అమల్లో ఉంది. ఫలితం వెల్లడైన తర్వాతే ఆ జిల్లాలో చీరలు పంపిణీ చేస్తారు. నియోజకవర్గాల పరిధిలో జరిగే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఏడాది 1.02 కోట్ల చీరలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే 75 లక్షల చీరలను జిల్లాలవారీ కోటాకు అనుగుణంగా సరఫరా చేశారు.
670 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి
బతుకమ్మ చీరల తయారీలో భాగంగా 670 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి జరగాల్సి ఉండగా. ఈ నెల 30వ తేదీ నాటికి లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చీరల నేత ద్వారా సిరిసిల్లలోని 26 వేల మరమగ్గాలపై ఆధారపడిన 16 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు కేటాయించింది.
వంద రంగులు.. నిఫ్ట్ డిజైన్లు
బతుకమ్మ చీరల రూపకల్పనలో చేనేత విభాగం ప్రత్యేక శ్రద్ధ చూపింది. నిఫ్ట్‌కు చెందిన నిపుణులు విభిన్న రంగుల్లో వంద రకాలైన జరీ అంచు చీరలను డిజైన్ చేశారు. యువతులు, మధ్యవయస్కుల కోసం ఆరు గజాలు, ఉత్తర తెలంగాణలో వృద్ధ మహిళలు ధరించే చీరలను తొమ్మిది గజాల పొడవు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వార్డుస్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళాసంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండి చీరలను అందజేస్తారు. 2017లో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా గత రెండేళ్లలో 1.90 కోట్ల చీరలను పంపిణీ చేయగా ఇప్పటివరకు రూ.715 కోట్లు వెచ్చించారు.
Comments
Please login to add a commentAdd a comment