
పెద్దపల్లి: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పరిపాలనకు పెద్దపల్లి నుంచే పతనం మొదలవుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. పెద్దపల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పార్టీ ఇన్‌చార్జి నర్సింహరెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మృత్యుంజయం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశల పునాదులపైన అధికారం చేజిక్కించుకొని కుటుంబ పాలన కొనసాగిస్తుందని, ఇక ఆ పాలనకు పెద్దపల్లి నుంచి అంతిమ రోజులు ఆరంభమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడిగిన పేద వారందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, అడిగిన, ఏడ్చిన వారికి సైతం డబుల్ బెడ్‌రూంఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు.
నలుగురికి లబ్ధి: శ్రీధర్‌బాబు
4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని నలుగురు కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నోరు తెరిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. దోమపోటు కారణంగా రైతులు నష్టపోతే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు.
టీడీపీ లైనింగ్ చేసింది: విజయ్
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టారని, టీడీపీ పాలనలో ఆ కాలువలకు సీసీ లైనింగ్ చేసి నీటి సరఫరాను క్రమబద్ధీకరించారని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు చేపట్టకపోగా, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నుంచి సిద్దిపేట, గజ్వల్‌లాంటి ప్రాంతాలకు నీరు అక్రమంగా తరలిస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలకు నీళ్లందడం లేదని ప్రకటించారని, ఈ ఇద్దరు నాయకులు మాత్రం రైతులకు నీళ్లిచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
నాయకులు సి.సత్యనారాయణరెడ్డి, ఈర్ల కొమురయ్య, గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, గోమాస శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గీట్ల సవితారెడ్డి, చేతి ధర్మయ్య, వేముల రామ్మూర్తి, అంతటి అన్నయ్యగౌడ్, భూషణవేణి రమేశ్‌గౌడ్, బయ్యపు మనోహర్‌రెడ్డి, అక్కపాక నరేశ్, ఊట్ల వరప్రసాద్, యాట దివ్యారెడ్డి, కల్లెపల్లి జాని, మంథని నర్సింగ్, గంట రాములు, సాయిరి మహేందర్, నూగిళ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment