సాక్షిప్రతినిధి, కరీంనగర్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుడుతోంది. ప్రజాబలం ఉండి కలిసొచ్చే నేతలను పార్టీలో కలుపుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. జూలైలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖాయమని తేలడంతో కొత్తబలం కోసం అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌లు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ సంస్థాగత పటిష్టతపై దృష్టి సారించారు. ఓ పక్క అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు.. మరోవైపు పార్టీ బలం పెంచుకునే క్రమంలో ఆ పార్టీ నేతలు ‘ఆపరేషన్ ఆకర్ష్’పై దృష్టి సారించినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల నుంచి మంథని వరకు, చొప్పదండి నుంచి హుజూరా బాద్ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై ఎక్కువ ఫోకస్ చేయడం, ఆయా పార్టీల్లో అసంతృప్తి నేతలతో మంత్రులు ఈటల రాజేందర్, పార్టీ ప్రజాప్రతినిధులు ఫోన్‌లలో మాట్లాడుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలే లక్ష్యంగా..
ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు.. మరో నెల గడిస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుండగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అధికార పార్టీ సీరియస్‌గా ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఆయా పార్టీల నేతలను ఒక్కొక్కరిగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. రైతుబంధు పథకం ప్రారంభంలో భాగంగా ఈనెల 10న సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆపరేషన్ ఆకర్ష్‌పై మరింత దృష్టి సారించారు. జిల్లా పార్టీ ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, జిల్లాకు చెందిన మంత్రులు ఈటల, కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ,
ఎమ్మెల్యేలు గంగులు కమలాకర్, శోభ, సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తదితరులు కీలక సమావేశం కూడా నిర్వహించా రు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నుంచి బలమైన నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేరేలా ఆపరేషన్ ఆకర్‡్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరారు. హుజూరా బాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పలువురు కారెక్కారు.
మూడు పార్టీలపైనా ప్రత్యేక దృష్టి.. కొనసాగుతున్న వలసలు..
ఏడాదిగా జిల్లాలో ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నప్పటికీ.. ఎక్కువ శాతం తెలుగుదేశం, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు. ఈసారి వలసలన్నీ టీఆర్‌ఎస్ పార్టీలోకి సాగేలా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్, టీడీపీ,బీజేపీపై దృష్టి సారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ చొల్లేటి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దేశిని కోఠిలతోపాటు కమలాపూర్‌కు చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధులు కన్నూరు సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కరీంనగర్‌కు వచ్చే సరికి బీజేపీలో ఉన్న నాలుగు స్తంభాలాటను ఆసరాగా చేసుకొని అసంతప్తివాదులందరినీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకర్‡్ష మంత్రంతో లాగేస్తున్నారు. ఇప్పటికే ఈ పార్టీలో సీనియర్ నాయకులైన బల్మూరి జగన్మోహన్‌రావు, డి.శ్రీధర్ టీఆర్‌ఎస్‌లో చేరారు.
ప్రస్తుతం పార్టీ మీడియా సెల్ జిల్లా కన్వీనర్‌గా ఉన్న సుంకపాక విద్యాసాగర్ ఇప్పటికే రాజీనామా చేయగా, పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆదివారం గులాబీ గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంథని నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ చల్లా నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు 200 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పశ్చిమలో ఎంపీ కవిత పావులు.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాపై దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఆమె, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులను కారెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్య అనుచరుడు, ఆ నియోజకవర్గం ఇన్‌చార్జి బోగ వెంకటేశ్వర్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో శుక్రవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి రమణ తర్వాత అత్యంత కీలకమైన వెంకటేశ్వర్లు పార్టీని వీడటం పెద్ద దెబ్బే. ఆయనతోపాటు ఒడ్డెర, పద్మశాలి సంఘాల రాష్ట్ర నాయకులు మొగిలి, బూస గంగారాం,
మానపూర్ శ్రీహరి, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు చీని సురేందర్, వైశ్య, వర్తక సంఘం నాయకుడు చకిలం కిషన్, జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బోగ ప్రవీణ్ వారి అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు టీడీపీ కోరుట్ల సెగ్మెంట్ ఇన్‌చార్జి సాంబారి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి ధనుంజయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తోట సత్యనారాయణ, ఊటూరి ప్రదీప్ టీఆర్‌ఎస్‌లో చేరారు. దాదాపుగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయినట్లేనన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment