జిల్లాలో తొలి స్వైన్‌ఫ్లూ మరణం నమోదు | District into the first flu death | Sakshi
Sakshi News home page

జిల్లాలో తొలి స్వైన్‌ఫ్లూ మరణం నమోదు

Published Tue, Jan 27 2015 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

District into the first flu death

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి
నర్సంపేట ప్రవీణ్‌కు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ
మరో ఇద్దరి రిపోర్టుల కోసం ఎదురుచూపు

 
హసన్‌పర్తి : నగరంలోని చింతగట్టు క్యాంపు ప్రాంతానికి చెందిన బి.శాంతమ్మ(51) అనే మహిళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు ఆర్‌డీ నాగేశ్వర్‌రావు వెల్లడించారు. సోమవారం ఆయన మృతురాలి ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చింతగట్టు క్యాంపు ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ ఈ నెల 12వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆమె జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుడిని ఆశ్రయించింది. జ్వరం నయం కాకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. చికిత్స చేస్తుండగా ఆమెకు ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సైన్‌ఫ్లూగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా యశోదా ఆస్పత్రి అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆర్డీ నాగేశ్వర్‌రావు, డాక్టర్  కృష్ణారావు, డాక్టర్ గణేష్, డాక్టర్ రాజిరెడ్డి చింతగట్టు క్యాంప్‌లో పర్యటించారు.
 వంద ఇళ్ల పరిధి వరకు వ్యాధి సోకే అవకాశం..

సైన్‌ఫ్లూ సోకిన బాధితుడి పరిసరాల్లో వంద ఇళ్ల వరకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని ఆర్డీ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన చింతగట్టుక్యాంప్, నర్సంపేటతోపాటు పెద్ద మ్మ గడ్డ ప్రాంతంలో వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నట్లు వివరించారు. అక్కడ ఇంటింటికి వెళ్లి సైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి, నివారణపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సైన్‌ఫ్లూ వ్యాధి సోకిన బాధితురాలి చుట్టుపక్కల ఉన్న  గుండెనొప్పి, కిడ్నీ బాధితులు, చిన్న పిల్లలు తమ ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
లక్షణాలు...

నాలుగు రోజులపాటు జ్వరం తగ్గకుండా ఉండడం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒల్లు నొప్పి, విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం, మెదడు వద్ద వాపు రావడం వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు.  ఇవి కనిపించిన వెంటనే స్థానిక వైద్యాధికారిని సంప్రదించి ప్రాథమిక వైద్యం తీసుకోవాలన్నారు. బాధితుల కోసం 18004250095 టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచినట్లు  తెలిపారు.
 
నర్సంపేట ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డు..

నర్సంపేట : పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోవువారం స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డును వైద్య, ఆరోగ్య శాఖ ఆర్‌డీ నాగేశ్వర్‌రావు సందర్శించారు. ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ ఉదయ్‌సింగ్, ఎస్పీహెచ్‌ఓ వెంకటరవుణ పాల్గొన్నారు.

ఎంజీఎంలో మరో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసు

ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన అమీనా అనే రోగికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనబడటంతో ఆమె ను వైద్యులు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. జలుబు, జ్వరంతో బాధపడుతూ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమె తెమడ నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ప్రివెంట్ మెడిసిన్‌కు పంపించారు. నాలుగురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన నర్సంపేటకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. కాగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన స్వైన్ ఫ్లూ అనుమానిత రోగి తనూజకు చెందిన రోగ నిర్ధారణ పరీక్షల కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. తెమడ నమూనాలు పంపినా 72 గంటలు గడిచినా నివేదికలు అందకపోవడంతో వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement