
ఎన్నికపై ‘గులాబీ’ సభ్యుల్లో అసంతృప్తి
వరంగల్ :జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఎన్నికలు టీఆర్‌ఎస్‌లో గందరగోళానికి దారితీస్తున్నాయి. డీపీసీ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆ పార్టీ ముఖ్య నేతల వైఖరి.. ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సొంత నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లోనే ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. డీపీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో ఈ విషయం స్పష్టమైంది. డీపీసీలో 30 మంది సభ్యులు ఉంటారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షురాలిగా, కలెక్టర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన 24 మందిని ఎన్నుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 17 మంది జెడ్పీటీసీ సభ్యులు, పట్టణ/నగర ప్రాంతాల నుంచి కౌన్సిలర్లు/కార్పొరేటర్లు కలిపి ఏడుగురు సభ్యులుగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యుల నుంచి 17 మందిని ఎన్నుకునే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
17 స్థానాల విషయంలో టీఆర్‌ఎస్‌కు 10 స్థానాలు, కాంగ్రెస్‌కు 6 స్థానాలు, టీడీపీకి ఒకటి చొప్పున కేటాయించుకునేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే డీపీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఒప్పందాన్ని ప్రతిపాదించిన టీఆర్‌ఎస్ సభ్యులే 18 మంది నామినేషన్లు వేయడంతో ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. డీపీసీలో టీఆర్‌ఎస్‌కు కేటాయించిన 10 స్థానాల్లో డిప్యూటీ సీఎం టి.రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించాలని అనుకున్నారు.
వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి ఒక్కో జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చేలా టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా అంగీకారం కుదిరింది. టీఆర్‌ఎస్‌కు సంబంధించి డీపీసీ తమ నియోజకవర్గానికి కేటాయించిన స్థానానికి ఎవరిని ప్రతిపాదించాలనేది ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే అప్పగించారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం సమక్షంలో జిల్లాలోని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ మేరకు అంగీకారం కుదిరింది.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి, లింగాలఘణపురం జెడ్పీటీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో ఒకరి పేరు ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మరొకరి పేరును ఎంపీ కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్లు వేశారు. దీంతో ఉన్నత పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఎవరికి సర్ది చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.
జనగామ నియోజకవర్గం నుంచి జనగామ జెడ్పీటీసీ సభ్యుడి పేరును స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన బచ్చన్నపేట, చేర్యాల జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. ఇద్దరి నామినేషన్లను ఉపసంహరింపజేందుకు టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి హసన్‌పర్తి జెడ్పీటీసీ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అనూహ్యంగా వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురికి సర్దిచెప్పడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
పాలకుర్తి నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు నామినేషన్ వేశారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన కొడకండ్ల, దేవరుప్పుల కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. వీరిద్దరినీ ఏ పార్టీలో పరిగణిస్తారనేది ఉపసంహరణ రోజున స్పష్టత రానుంది.
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ వెంట టీఆర్‌ఎస్‌లో చేరారు. డీపీసీలో ఈ నియోజకవర్గం కోటాలో ఒకరికి అవకాశం ఉంటే.. మరిపెడ, నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు.
టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ములుగు, భూపాలపల్లి, పరకాల, నెల్లికుదురు(మహబూబాబాద్) జెడ్పీటీసీ సభ్యులు నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్‌లోనూ ఇంతే...
ఒప్పందంలో భాగంగా డీపీసీలో టీఆర్‌ఎస్‌కు ఏడు స్థానాల కేటాయింపు జరిగింది. అయితే ఏకంగా 9 మంది సభ్యులు నామినేషన్లు వేశారు. మహబూబాబాద్, గోవిందరావుపేట, ఆత్మకూరు, కేసముద్రం, ఏటూరునాగారం, మద్దూరు, తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
వీరికితోడు కాంగ్రెస్ నుంచి గెలిచి చైర్‌పర్సన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన కొడకండ్ల, దేవరుప్పుల జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు టీఆర్‌ఎస్ కోటాలో నామినేషన్ వేశారు.