ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు కమీషన్లు తీసుకున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయరాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
వాటిని ప్రచురించొద్దు... పత్రికలు, చానల్స్‌కు సివిల్ కోర్టు ఆదేశం
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు కమీషన్లు తీసుకున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయరాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2వ అదనపు ప్రధాన న్యాయమూర్తి వై.అరవింద్‌రెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వీరిద్దరు చేసిన ఆరోపణలను ప్రచురించరాదని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికలను, వారి వ్యాఖ్యలను ప్రసారం చేయరాదని వీ-6, సాక్షి చానల్స్‌ను ఆదేశించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కల్గిస్తున్న పొన్నం, సంపత్‌కుమార్‌లతోపాటు 4 ప్రసార సాధనాలపై జగదీశ్‌రెడ్డి రూ.2 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు.
ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, దీంతో తన క్లయింట్ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాది భరత్‌కుమార్ వాదనలు వినిపించారు. ఆధారాలుంటే దర్యాప్తు సంస్థల ముందుంచాలని, అంతేతప్ప ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కల్గించరాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి...మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేశారు.