దళారులు దోచేశారు..!
దళారులు దోచేశారు..!
Published Thu, Sep 18 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
పంట రుణాల మాఫీ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ రోజుకో అక్రమం వెలుగు చూస్తోంది. పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు కాళ్లరిగేలా బ్యాంకు చుట్టూ తిప్పుకునే అధికారులు.. కోట్ల రూపాయలు బినామీలకు ఇచ్చేశారు. ఏళ్లకొద్దీ బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేసి రుణమాఫీ పథకంలో బయటపడాలనుకున్నారు. రైతుమిత్ర గ్రూపులకు రుణమాఫీ పథకం వర్తించదనే ఆందోళనతో ఏకంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. వంగూరు మండలం చారకొండ ఆంధ్రాబ్యాంకు శాఖ 2009-11 మధ్యకాలంలో 29 రైతుమిత్ర సంఘాలకు రూ.1.20కోట్లు పంట రుణంగా మంజూరు చేసింది. అప్పటి నుంచి అసలు, వడ్డీ చెల్లించకపోవడంతో ఈ మొత్తం బినామీ ఖాతాల్లో చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బినామీ రైతుమిత్ర సంఘాలను సృష్టించి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు సమాచారం. సిరిసినగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూ ములను తనఖా పెట్టి రుణం పొందినట్లు ప్రాథమికంగా తేలింది. సాధారణంగా దేవాలయ భూములను కౌలుకు ఇచ్చి లీజు ఒప్పందం చేసే అధికారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి అధికారికి ఉంటుంది. అయితే అక్రమార్కులు మాత్రం దేవాలయం ఈఓ, చైర్మన్ ద్వారా లీజు ఒప్పందం అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద పత్రాలను అడ్డుపెట్టుకుని బినా మీ రైతుమిత్ర సంఘాల పేరిట బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఒక్కో రైతుమి త్ర గ్రూపులో 10 నుంచి 15 మందిని సభ్యులుగా చూపి ఒక్కో గ్రూపు పేరిట రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం మం జూరు చేశారు. 29 సంఘాల్లో సుమారు 400 మంది సభ్యుల పేరిట రుణాలు మంజూరైనట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వందమందికి పైగా స్థానికేతరులే ఉన్నట్లు సమాచారం. మరికొందరు సభ్యుల పేరిట భూమి లేకున్నా అప్పు మంజూరైంది.
వసూలు కాని బకాయిలు
రుణం పొంది ఏళ్లు గడుస్తున్నా వాటిని తిరిగి చెల్లించడం లేదు. ఒక్కో సభ్యుడు సగటున రూ.50వేలకు పైగా బ్యాంకుకు బాకీ ఉన్నారు. రుణం చెల్లించాలంటూ ఇటీవల కొందరు సభ్యులకు బ్యాంకు నోటీసులు జారీ చేయడంతో విషయం వెలుగు చూసింది. చాలామంది రైతుమిత్ర గ్రూపు సభ్యుల చిరునామాలు కూడా బ్యాంకు అధికారులకు లభించడం లేదు. తమకు కొంత మొత్తమే ఇచ్చి ఎక్కువ మొత్తం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడమేంటని కొందరు సభ్యులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఇదే సమయంలో రుణమాఫీ పథకం అర్హుల జాబితా తేల్చేందుకు బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు అందజేసిన లబికధదారుల జాబితాలో రైతుమిత్ర గ్రూపులు కూడా ఉన్నాయి. సామాజిక తనిఖీ అనంతరం ఈ గ్రూపులను రెవెన్యూ అధికారులు బోగస్‌విగా తేల్చారు. విషయం బయటకు పొక్కుతుండడంతో బినామీ బాగోతం వెనుక ఉన్న కొందరు సూత్రధారులు కొత్త నాటకానికి తెరలేపారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో రైతుమిత్ర గ్రూపులను కూడా చేర్చాలంటూ కలెక్టర్‌ను కలిసి విజ్ఞాపన సమర్పించారు.
రుణం రికవరీ కష్టమే?
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని రైతుమి త్ర గ్రూపుల ముసుగులో దళారులు నొక్కేసినట్లు రెవెన్యూ అధికారులు అంగీకరిస్తున్నా రు. దళారులకు బ్యాంకు అధికారులు సహకరించడం వల్లే ఈ తతంగం జరిగిందని అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. ఒక్కో సభ్యుడికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎంత మొత్తం దళారులు మింగారనే అంశంపై అంచనాకు వస్తామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. అక్రమాల కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు కూడా రంగం చేస్తున్నట్లు సమాచారం. కాగా గతంలో చారకొండ పీఎసీఎస్ నుంచి 59మంది నకిలీ పాసు పుస్తకాలు తనఖా పెట్టి రూ.11.17లక్షల రుణం పొందిన వైనం ఈ సందర్భంగా గమనార్హం.
Advertisement
Advertisement