సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని మీడియాకు తప్పుడు ప్రచారం ఇచ్చిన డాక్టర్ వసంత్‌ను సోమవారం అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మంగళవారం ఆయన ఆసుపత్రి ఎదుట పెట్రోల్ డబ్బాతో వీరంగం సృష్టించాడు. వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ సీఎంవోగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో గాంధీలో ఇద్దరూ కరోనా వైరస్ బారీనా పడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో తాను చేయని తప్పుకు బలయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు సృష్టించారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆసుపత్రి ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఈ నేపథ్యంలో నడుము చుట్టూ పెట్రోల్ బాటిళ్లను కట్టుకుని వచ్చి ఎవరైనా దగ్గరకు వస్తే కాల్చుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
కాగా... కరోనా వైరస్‌పై వదంతులను ప్రచారం చేసినందుకే డాక్టర్ వసంత్‌పై వేటు పడినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇది ఒక్కటే కారణం కాదని.. గత ఏడాదిగా పాలనపరంగా తోటి డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆయనపై పలుమార్లు ఆరోపణలు వచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షతో డాక్టర్‌పై చర్యలు తీసుకున్నామన్నది అవాస్తవం అన్నారు. ఇక డాక్టర్ వసంత్‌తో పాటు మరో ముగ్గురు వైద్యులను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment