మా కొడుకు..కాదు మా కుమారుడే
Published Wed, Dec 2 2015 11:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
పోలీస్ స్టేషన్ కు చేరిన మగశిశువు వివాదం
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గత సోమవారం ఇద్దరు గర్భిణులు ఆస్పత్రిలో ప్రసవించగా, మగశిశువు తమకే జన్మించాడని రెండు కుటుంబాల వారు మా కొడుకు అంటే మా కొడుకు అంటూ ఆస్పత్రిలో శిశువుల బంధువులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెండు కుటుంబాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రి వైద్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారులు ఎవరి పిల్లలు అని గుర్తించేందుకు నేడో రేపో వారి రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నట్టు వైద్యులు వెల్లడించారు. చిన్నారులు పుట్టినప్పటి నుంచి నేటి వరకు తల్లి ఒడికి దూరంగానే ఉంటున్నారు. వారి ఆలనా పాలనా ఆస్పత్రి సిబ్బంది చూస్తున్నారు.
ఇదిలా ఉంటే రెండు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు సీఐ మొగలయ్య జోక్యం చేసుకుని ఎవరు ఎవరి చిన్నారులని తెలిసేంత వరకు వైద్యుల గుర్తులు పెట్టిన విధంగా చిన్నారులను తల్లుల వద్దకు చేర్చాలని సూచించారు. ఏది ఏమైనా డీఎన్ఏ పరీక్షలు అయితే గానీ వివాదం సద్దుమనిగేలా ఉంది. డీఎన్ఏ రిపోర్టు రావడానికి నెల రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement