
వీధి కుక్కల దాడిలో గాయపడిన అఖిల్
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు మండుటెండలు.. మరోవైపు వీధి కుక్కలునగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగాఉండడంతో వీధి కుక్కలు విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై పంజా విసురుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా మంగళవారం మల్కాజిగిరిలో ఓ బాలుడిపై ఏకంగా 15 వీధి కుక్కలు దాడి చేయడం కలకలం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా 43 డిగ్రీలకు పైగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలే వీధి కుక్కల వింత ప్రవర్తనకు కారణమని వెటర్నరీ వైద్యులు పేర్కొంటున్నారు.
జాగ్రత్తలు అవసరం...
♦ అధిక ఎండలో పెంపుడు జంతువులు విపరీతంగా ప్రవర్తిస్తాయి.
♦ పార్కింగ్ చేసిన కార్లలో పెంపుడు జంతువులు ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ అనారోగ్యం పాలైతే పెట్ క్లినిక్స్‌కు తీసుకెళ్లండి. అవసరమైన మేర వ్యాక్సిన్‌లు ఇప్పించండి.
♦ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు అవి ఎండకు తిరగకుండా చూడాలి.
♦ ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిగా ఎండ తగ్గిన తర్వాతే వాటితో వాకింగ్‌కు వెళ్లండి.
♦ వేసవిలో వాటికి పెట్ డాక్టర్స్ సూచించిన మేరకు సమపాళ్లలో ప్రత్యేక ఆహారం అందించాలి.
♦ పెట్స్‌ను ఉంచే ప్రదేశం చల్లగా ఉండేలా చూసుకోవాలి. గోనె సంచులతో రక్షణ కల్పించాలి. వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ ప్రతిరోజు 20–25 నిమిషాల పాటు పెట్స్‌పై నీటిని చల్లే ఏర్పాట్లు చేయండి.
♦ క్లోరిన్ కలిపిన నీటిలో పెట్స్ అధిక సమయం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
♦ పెట్ తరుచూ సొల్లు కార్చడం, శ్వాస ఎక్కువగా తీసుకుంటూ శబ్దం చేయడం, గుండె రేటు పెరుగుతుండటం, నాలుక ఎరుపు రంగులోకి రావడం, టెంపరేచర్ 105–106 వరకు ఉండటం.. లాంటివి కనిపిస్తే ట్రీట్‌మెంట్ చేయించాలి.
♦ ఇంటి వద్ద ఐస్‌ప్యాక్ ఉంచుకోవాలి. ఐస్‌ప్యాక్‌ను పొట్టపై పెడితే చాలా వరకు టెంపరేచర్ సులభంగా పోతుంది.
♦ సమ్మర్‌లో పెట్స్ ‘పార్వో’కి గురవుతాయి. ‘పార్వో’ అనేది ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది సోకితే వాంతులు, మోషన్స్‌కు గురవుతాయి. దీంతో డీహైడ్రేషన్ అవుతుంది. టిక్స్ కారణంగా టిక్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులను సంప్రదించాలి.
♦ చిన్న పెట్స్, పెద్ద పెట్స్‌కు శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిపై యజమానులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పగ్ బ్రీడ్ పెట్స్ శ్వాసనాళాలు చాలా చిన్నవిగా ఉంటాయి. దీనిద్వారా టెంపరేచర్‌ని అవి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. సెయింట్ బెర్నోడ్ బ్రీడ్ పెట్ చాలా పెద్దగా ఉంటుంది. దీని శ్వాసనాళాలు పెద్దవిగా ఉండటం కారణంగా టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేసుకోలేవు.
♦ పెట్స్ టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమ్మర్ హీట్‌ను తట్టుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో 25–30 డిగ్రీల మేర టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. అవకాశం ఉంటే ఏసీ లేదా కూలర్ వెసులుబాటు కల్పించాలి. ఈ రెండూ లేకపోతే ఫ్యాన్ గాలి నిరంతరం వచ్చేలా చూసుకోవాలి. కిటికీలను తెరిచి ఉంచాలి. అవే కిటికీలకు కటన్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
♦ కమర్షియల్ ఫుడ్‌గా పిలిచే ‘క్యాలిబ్రా, రాయల్‌కేన్, పెడిగ్రీ’ వంటివి పెట్టొచ్చు. పెట్ బరువుకు తగ్గట్టుగా ఫుడ్‌ని పెట్టాలి. తక్కువ, చల్లని సమయాల్లో పెడితే అవి ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎండ ప్రభావం ఎక్కువ...
వీధి కుక్కలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అవి అధికంగా సంచరించే ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకునే సమయంలో పిచ్చిగా ప్రవర్తిస్తూ కాటేస్తున్నాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతోంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండా కుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. వీధి కుక్కల బెడద అధికంగా ఉంటే జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయాలి. – స్వాతిరెడ్డి, వెటర్నరీ డాక్టర్
చిన్నారిపై 15 కుక్కల దాడి
మౌలాలి: ఓ చిన్నారిపై 15 వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి మౌలాలిలో జరిగింది. వివరాలు... మౌలాలి గుట్టపైనున్న దర్గాలో రెండు రోజులుగా అజ్రత్ అలీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో అఖిల్ అనే ఆరేళ్ల చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అయితే అఖిల్ అక్కడ ఆడుకుంటున్న సమయంలో 15 వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనరల్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న అఖిల్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి వెటర్నరీ విభాగం అధికారులు మౌలాలి గుట్టను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. మున్సిపల్ వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కుక్కలను వెటర్నరీ కేంద్రానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు అమినుద్దీన్, కాంగ్రెస్ నాయకులు వంశీముదిరాజ్, షరీఫ్, కాలనీ వాసులు అక్కడికొచ్చి అధికారులను నిలదీశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించి, రూ.5లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ అధికారిని సస్పెండ్ చేయాలన్నారు.
ఎన్‌జీఆర్‌ఐలో వీధి కుక్కల వీరంగం
ఉప్పల్: ఉప్పల్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఆవరణలో ఈ నెల 24న వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. వీటి దాడిలో దాదాపు 10 మంది గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడికి కన్నుపై గాయమవగా, మరో మహిళ రాధా (58) తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. 24న ఎన్‌జీఆర్‌ఐ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఓ శుభకార్యం జరగ్గా.. అక్కడికి వచ్చిన వారిపై కుక్కలు దాడి చేశాయి. కాలనీలో కుక్కల బెడద ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
నాలుగు కళేబరాలు లభ్యం...
కుక్కలు దాడులు చేస్తున్నాయన్న నెపంతో ఎన్‌జీఆర్ క్యాంపస్‌లో దాదాపు 10కి పైగా కుక్కలను కొట్టి చంపారని ఆరోపిస్తూ పీపుల్స్ ఫర్ పెట్, యానిమల్స్ సీఈవో జోషి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ వెటర్నరీ డా.కృష్ణ ఆధ్వర్యంలో ఎన్‌జీఆర్‌ఐ ప్రాంగణంలో మంగళవారం పరిశీలించగా... నాలుగు కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయని డాక్టర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment