సాక్షి, సిటీబ్యూరో: ఆహారం దొరకకపోవడం.. రహదారులు, వీధులన్నీ నిర్మానుష్యంగా మారడంతో వీధి కుక్కలు గంగవెర్రులెత్తుతున్నాయి. విపరీత ప్రవర్తనతో మనుషులపై ఎగబడుతున్నాయి. వాహనాల వెంట పరుగెత్తి బెంబేలెత్తిస్తున్నాయి. హోటళ్లు, బార్‌లు, ఫంక్షన్ హాళ్లు , హాస్టళ్లు వంటి వాటితో వీటికి నిత్యం ఆహారం దొరికేది. లాక్‌డౌన్‌తో ఇవి మూతపడటంతో ఆకలితో నకనకలాడుతున్నాయి. తాగునీరు కూడా దొరక్కడీహైడ్రేషన్‌కు గురవుతున్నాయి. అడపాదడపా మనుషులు కనిపిస్తేపిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో అత్యవసర పనుల మీదబయటకు వెళ్లేవారు, రాత్రుళ్లు విధులు నిర్వహించే వారు కుక్కల భయంతో వణికిపోతున్నారు. పగలు బిక్కుబిక్కుమంటున్న కుక్కలు రాత్రిళ్లు ఆకలికి తాళలేక తీవ్రంగా అరుస్తున్నాయని వివిధ ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.
నగరంలో తగ్గని కుక్కల సంఖ్య..
కుక్కల జీవిత కాలం సుమారు 10 ఏళ్లు. 8 నెలలు వచ్చినప్పటి నుంచే కుక్కలకు సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది. గర్భస్థ సమయం దాదాపు రెండు నెలలు. ఒక్కో కుక్క ఏటా రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. తడవకు 4– 8 పిల్లలు పుడతాయి. ఇలా ఒక కుక్క ద్వారా ఏటా 40కిపైగా కుక్కలు జనం మధ్యకు వస్తున్నాయి.
గ్రేటర్‌లో దాదాపు
10 లక్షల కుక్కలున్నాయి. అంటే ఏటా ఎన్ని కుక్కలు పుడతాయో అంచనా వేసుకోవచ్చు. వీటి సంతతిని అరికట్టే యంత్రాంగం, వనరులు, సామర్థ్యం జీహెచ్‌ఎంసీ వద్ద లేవు. దీంతో కుక్కల సంతాన నిరోధక ఆపరేషన్లు, వ్యాధి సోకకుండా యాంటీరేబిస్ వ్యాక్సిన్లు వంటివి వేస్తున్నా అవి సరిపోవడం లేదు. ఏటా దాదాపు 60వేల కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నా, వ్యాక్సిన్లు వేస్తున్నా నగరంలో కుక్కల సమస్య తగ్గడం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
లాక్‌డౌన్‌లో తగ్గిన ఆపరేషన్లు..
లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకొని ఎస్సార్‌డీపీ కింద ఫ్లై ఓవర్లు, రోడ్ల మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అదే తరహాలో ఎక్కువ కుక్కలకు ఆపరేషన్లు, వ్యాక్సిన్లు వంటివి చేస్తే సమస్య తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ.. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. సాధారణ రోజుల్లో ఒక్కో ఆపరేషన్ కేంద్రంలో సగటున రోజుకు 50 ఆపరేషన్ల వంతున ఐదు ఆపరేషన్ సెంటర్లలో 250 ఆపరేషన్లు చేసేవారు. ప్రస్తుతం రెండు కేంద్రాల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీటికి ఆపరేషన్లు చేసే ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్లు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావడంతో లాక్‌డౌన్‌తో వారు రావడం మానేశారు. కుక్కలను పట్టుకునే సిబ్బందిదీ అదే పరిస్థితి కావడంతో వారిలో చాలామంది రావడం లేదు. దీంతో ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు రెండు కార్యక్రమాలు గతంలో కంటే కుంటుపడ్డాయి.
జనం బెంబేలు..
కుక్కలు కరవకపోయినా వాటిని చూసి జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ ప్రభుత్వ డ్యూటీలకు వెళ్లేవారు, డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లేవారిని చూసి వాహనం లైటు వెలుతురుకు పడుకున్న కుక్కలు గుంపులుగా ఒకేసారి పైకి లేవడంతో భయానికి వాహనం అదుపు తప్పిగాయాల పాలవుతున్నారు. తీవ్ర గాయాలతో మరణించిన వారూ ఉన్నారు.
స్వచ్ఛంంద సంస్థల ఆసరా..
లాక్‌డౌన్‌లో అల్లాడుతున్న కుక్కల పరిస్థితిని గ్రహించిన డాగ్ లవర్స్, స్వచ్ఛంద సంస్థలు పోలీసు అధికారుల నుంచి అనుమతి పొంది, ఆయా ప్రాంతాల్లో వాటికి ఆహారం అందజేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వకీల్ తెలిపారు.
వీధి కుక్కల బారినపడి మృత్యువాత
చార్మినార్: కుక్కలు అడ్డురావడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మామిడి రాజు (35) అనే పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ మూడుగుళ్లు ప్రాంతానికి చెందిన మామిడి రాజు సుల్తాన్‌బజార్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్. లాక్‌డౌన్‌లో ఆయన సుల్తాన్‌బజార్‌లోని ఓ బ్యాంక్ కూడలి వద్ద విధి నిర్వహణలో ఉన్నాడు. ఈ నెల 8న డ్యూటీ చేసి.. 9న ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మూసీపై ఉన్న చాదర్‌ఘాట్ కాజ్‌వే మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. సగం దూరం రాగానే నడి రోడుప్డై ఉన్న కుక్కలు వాహనం చప్పుడుకు లేచి వాహనానికి అడ్డువచ్చాయి. దీంతో రాజు ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. హెల్మెట్ సైతం దూరంగా పడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో అధిక రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయాడు. వెంటనే మలక్‌పేట్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా డిక్లేర్ చేశారు. ఆయన ఈ నెల 13న మృతి చెందాడు. కాగా.. మరో సంఘటనలో బుధవారం ఉదయం గాంధీనగర్‌లో వీధి కుక్కల బారిన పడిన ఓ గుర్తు తెలియని వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment