సాక్షి, దుబ్బాక: అనాధ అవ్వ.. నిన్నమొన్నటి వరకు భిక్షాటన చేసుకుంటూ జీవించేది. ఇంటికి తలుపేసి ఉంటే బయటకు వెళ్లిందేమోననుకున్నారు అంతా. బ్రతుకు పోరులో అలసి తనువు చాలించిన ఆ అవ్వ శవాన్ని కుక్కలు గుంజుకొస్తే గాని చనిపోయిందని తెలియలేదు .
వివరాల్లోకి సిద్ధిపేట జిల్లా, దుబ్బాకు చెందిన అలుగుల్ల సత్తవ్వ(70) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె భర్త పోశయ్య 20 ఏళ్ల క్రితమే మరణించాడు. పిల్లలు లేకపోవడం, భర్త మరణించడంతో అనాధ అయిన ఆమె ఐదేళ్లుగా భిక్షాటన చేసుకొని జీవించేది. చిన్నపాటి ఇంట్లో ఉంటూ ఉన్ననాడు తింటూ లేనినాడు పస్తులుండేది. ఈ క్రమంలో శనివారం నుంచి సత్తవ్వ కనబడలేదు. ఎక్కడికో వెళ్లిపోయిందని చుట్టుపక్కల వారు భావించారు.
కానీ మంగళవారం రాత్రి కుక్కల అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు సత్తవ్వ ఇంటివైపు చూశారు. అక్కడికి వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో లోపలికి తొంగిచూడగా వారికి సత్తవ్వ కాలు బయటకు కనిపిస్తూ మిగతా శరీరం తలుపు వెనుకాల ఉండిపోయి కనిపించింది. చనిపోయిన సత్తవ్వను కుక్కలు బయటకు లాక్కొచ్చినట్లు గమనించారు. ఈ విషయం గ్రామంలో దావనలంలా వ్యాపించడంతో సంఘటన స్థలానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తలుపు దగ్గర శవం ఇరుక్కపోవడంతో కుక్కలు బయటకు తేలేకపోయాయని గ్రహించారు. సత్తవ్వ శవానికి గ్రామస్తులే చందాలు పోగు చేసుకుని బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
వృద్ధురాలి శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
Published Wed, Sep 6 2017 9:18 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement