దొంగల్లుడు
మామ గారి లారీ చోరీ
గుట్టు రట్టుచేసిన పోలీసులు
సిద్దిపేట రూరల్ : లారీని నడపలేక.. దానిపై తీసుకున్న ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక లారీని అల్లుడి ఇంటి దగ్గర పెడితే ఆ అల్లుడు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా అపహరించాడు. లారీ కనిపించడం లేదంటూ మామ ఫిర్యాదు చేయడంతో అల్లుడు గారి బాగోతం బయటపడింది. శుక్రవారం రూరల్ పోలీసుస్టేషన్‌లో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామానికి చెందిన నల్లారి కనకయ్య శ్రీరామ్ ఫైనాన్స్ సహాయంతో లారీ (ఏపీ16టీబీ5226) కొన్నాడు. అయితే దాన్ని తిప్పలేక, కిస్తీలు కట్టలేక ఎన్సాన్‌పల్లిలో ఉండే అల్లుడు ఆకుల రవి దగ్గర లారీని ఉంచాడు.
కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వాళ్లు ఒత్తిడి చేయడంతో కనకయ్య.. తన అల్లుడి వద్ద ఉంచిన లారీని తీసుకెళ్లాలని చెప్పాడు. అంతలో తానే లారీ కోసం వాకబు చేయగా అది కనిపించడం లేదని తేలింది. దీంతో ఆయన రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సీఐ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఎన్సాన్‌పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. లారీ టైర్లు తీసుకుని వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, కనకయ్య అల్లుడు రవితో పాటు బూర్గుపల్లి మల్లేశం, ఖైజర్‌ఖాన్, మూనవర్ హుస్సేన్, షేక్ ఖధీర్‌లు లారీని విడిభాగాలుగా చేసి అమ్ముకున్నట్లు తెలిపారు. ఆయా భాగాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.