
ఆత్మహత్యలు వద్దు.. భావి జీవితం ముద్దు
శివాజీనగర్ : జీవితంపై విరక్తి చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నిజామాబాద్‌కు చెందిన మానసిక వైద్యుడు విశాల్ సూచించారు. భావి జీవితంపై భరోసాతో జీవించాలన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవం సందర్భంగా నగరంలో నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ‘ఆత్మహత్యలు మానుకోండి -చిరంజీవులుగా జీవించండి’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జిల్లా కేంద్ర అస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో విశాల్ మాట్లాడారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామన్న దిగులుతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
మరికొందరు మూఢ నమ్మకాలతో భూతవైద్యులను ఆశ్రయిస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాతే ఆస్పత్రులకు వస్తున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు అది లేనిదే జీవించలేమన్న స్థితికి చేరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి వ్యక్తి నవ్వుతూ జీవించాలని, నవ్వడం వల్ల రోగాలు దూరమవుతాయని, ఆరోగ్యంగా జీవించగలుగుతామని జిల్లా ఆస్పత్రి పరిపాలన అధికారి నరేందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైస్ సూపరింటెండెంట్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.