నేడు పల్స్‌పోలియో
- జిల్లాలో 2,790 కేంద్రాల ఏర్పాటు
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ వెల్లడి
- జిల్లాలో 2,790 పల్స్‌పోలియో కేంద్రాలు
రాజేంద్రనగర్: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 22న ఆదివారం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,790 పోలియో కేంద్రాల ద్వారా 0-5 సంవత్సరాలలోపు ఉన్న 7,18,124 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శివరాంపల్లి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలియో బృందంలో పనిచేయడానికి జిల్లాలో 11,160 మంది సిబ్బందిని ఎంపిక చేశామన్నారు.
ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణకు 279 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, క్వారీ నిర్మాణం ప్రాంతాలు, సంచార జాతులు నివసించే ప్రదేశాల్లోని 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 65 మొబైల్ టీములను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని బస్టాండులు, రైల్వేస్టేషన్లలో కూడా పోలియో చుక్కలు వేసేందుకు 58 ట్రాన్సిట్ టీములను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లాలో రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 24 మంది అధికారులను నియమించామన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో..
రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలు, 14 గ్రామాల్లో ఆదివారం ఉదయం పల్స్‌పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు.