దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు
వారసుడి కోసం ఆ దంపతులు ఆడశిశువును వద్దకున్నారు.. మగ బిడ్డే ముద్దు.. ఆడబిడ్డ వద్దంటూ పేగుబంధాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.శిశువును అప్పగించేందుకు శిశుగృహకు చేరుకున్నారు. కానీ ఆ శిశువు పుట్టి మూడు నెలలు మాత్రమే కావడం, ఆరు నెలల పాటు తల్లి పాలనే పట్టించాలని అధికారుల కౌన్సిలింగ్‌తో వెనక్కు తగ్గారు. ఈ ఘటన తిరుమలగిరి మండలంలో మంగళవారం వెలుగుచూసింది.
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : మండలంలోని నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధి జాల్ తండాకు చెందిన జటావత్ అంజి, లక్ష్మి వ్యవసాయంతో పాటు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి కాన్పులో ఆడ శిశువు జన్మించింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లనే పుట్టడంతో తాము ఆ శిశువును సాకలేమంటూ ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తీసుకెళ్లారు. చిన్నారికి 3 నెలలు మాత్రమే ఉన్నాయని, కనీసం ఆరు నెలల వరకైన తల్లి పాలను పట్టించాలని అధికారులు సూచించడంతో నిరాశతో వెనుదిరిగారు.
ఉన్నతాధికారుల సూచన మేరకు సీడీపీవో గంధం పద్మావతి మంగళవారం గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి చదువు, పెండ్లి వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆడపిల్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సౌకర్యాలతో ప్రసవాలు చేస్తారన్నారు. దీంతో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12వేలు అందిస్తుందని తెలిపారు.
గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో ప్రతి గిరిజన బాలికకు రూ.లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యాయోజన పథకం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పేద విద్యార్థులకు చదువులు, సన్నబియ్యంతో పాటు, నాణ్యతతో కూడిన మెనూ అందిస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
మారని గిరిజన సంప్రదాయం
అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా గిరిజనుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన దంపతులు మగబిడ్డకు జన్మనివ్వాల్సిందే నట... ఆ దంపతుల సంతానంలో మగపిల్లాడు పుట్టకుండా, ఆడపిల్లలే పుట్టినట్లయితే ఆ తల్లిని గొడ్రాలిగా భావించి హీనంగా చూడడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారసుడి కోసం అత్తామామలు భర్తకు మరో యువతితో వివాహంం జరిపించటానికి వెనుకాడని పరిస్థితి.. తొమ్మిదినెలలు మోసిన తన బిడ్డను శిశుగృహకు అప్పగించటానికి ఆ తల్లులకు బాధగా ఉన్నా మగబిడ్డ కోసం తప్పడం లేదంటూ వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment