‘డబుల్’ గ్రామసభలో మహిళ ఆత్మహత్యాయత్నం
► అర్హులకు అన్యాయం చేశారని ఆరోపణ
► అధికారులతో గ్రామస్తుల వాగ్వాదం
► అర్ధంతరంగా సభ నిలిపివేత
శంకరపట్నం : డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని ఓ మహిళ రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని కొత్తగట్టు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో 160 మంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ గ్రామానికి ప్రభుత్వం 20 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఎస్సీలకు 13, బీసీలకు 9, ఓసీలకు 2, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ ఆమోదంతో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తహశీల్దార్ సంపత్ తెలిపారు.
జాబితాను చదువుతుండగానే గ్రామస్తులు అధికారులతో గొడవకు దిగారు. గ్రామానికి చెందిన అంబాల మౌనిక కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నా అభ్యంతరం చెప్పడంతో తొలగించారు. మిగతా జాబితా చదువుతుండగానే గీతాకార్మిక కుటుంబానికి చెందిన తాము 15 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని పైడిపెల్లి రేణుక కుటుంబం అధికారులతో వాగ్వాదానికి దిగింది. తమకు అన్యాయం జరిగిందని పైడిపెల్లి రేణుక,పైడిపెల్లి లత, పైడిపెల్లి సుమలత, పైడిపెల్లి లావణ్య కంటతడిపెట్టారు.
ఈ నలుగురిలో ఒకరికి డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించాలని గ్రామస్తులు సూచించగా జాబితాలో పేరు లేదని, తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రేణుక రసాయన ద్రావణం తాగింది. ఎంపీపీ విజయ, అధికారులు, గ్రామస్తులు రసాయన ద్రావణం బాటిల్ లాక్కున్నారు. ఆత్మహత్యాయత్నాకి యత్నించిన రేణుకను ఎంపీపీ ఓదార్చారు. ఆత్మహత్య పరిష్కారం కాదని ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తుందని నచ్చజెప్పారు. గ్రామసభలో మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో అధికారులు సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు.
అర్హులకు అన్యాయం జరిగింది..
కొత్తగట్టు గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఎంపికలో అర్హులకు అన్యాయం చేశారని ఎంపీటీసీ సభ్యుడు ఉప్పుగల్ల మల్లారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. గ్రామసభలో రేణుక ఆత్మహత్యాయత్నం చేయడం అధికారుల తప్పిదమేనని మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూం అబ్ధిదారుల ఎంపిక కోసం మరోసారి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.