డబుల్‌డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరుకు బైవీక్లీ సర్వీసులు
రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచి గూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచి గూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది.
- సాక్షి, నల్లగొండ
రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట..
నల్లగొండ నుంచి ప్రతిరోజూ పలుఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం రద్దీ ఉంటుంది. ప్రతిరోజు చాలా మంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వయా నల్లగొండ ద్వారా డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్, నర్సాపూర్, చెన్నై సూపర్‌ఫాస్ట్, నారాయణాద్రి, విశాక, పుష్‌పుల్, ఫలక్‌నుమా, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, పల్నాడు, శబరి, భావనగర్, రేపల్లె, జన్మభూమి, భువనేశ్వర్ రైళ్లు గుంటూరు, తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేకతలివీ..
- ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి.
- ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి.
- కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది.
- డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415,కర్నూలుకు రూ. 335,
తిరుపతికి రూ. 720