ఉండేనా.. ఊడేనా..?
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం.. జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉత్కంఠ రేపుతోంది. కొత్తగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తుందా...? లేదా..? అని లబ్ధిదారులకు గుబులు పట్టుకుంది. ప్రస్తుత పథకాల కంటే మెరుగైన పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నా.. మధ్యలో పథకాలు నిలిపేస్తే ఎలా? అనే భయం లబ్ధిదారులకు పట్టుకుంది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఇది వరకే ప్రకటించారు. కానీ, గత ప్రభుత్వ పథకాల కొనసాగింపు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గత ప్రభుత్వ పథకాలు అమలు చేయాలా? లేదా? అని ఇంకా నిర్ణయించలేదని హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత పథకాల లబ్ధిదారులు ఉత్కంఠకు గురవుతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
నిరుపేద విద్యార్థులందరికీ మెరుగైన ఉన్నత విద్య అందించాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందారు. 2013-14 సంవత్సరానికి జిల్లాలో 1,03,233 మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 8,136 మంది ఈబీసీ, 34,554 మంది ఎస్సీ, 1500 మంది ఎస్టీ విద్యార్థులు మొత్తం 1,47,423 మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అమృతహస్తం
పౌష్టికాహార లోపంతో ఎంతో మంది నిరుపేద గర్భిణీలు ప్రసవ సమయంలో ఇబ్బందులెదుర్కొంటున్నారు. పుట్టిన బిడ్డ బలహీనంగా ఉంటోంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితమే అమృతహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. పేరు నమోదు చేసుకున్న గర్భిణీలు.. బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది గర్భిణీలు, బాలింతలు పథకం ద్వారా లబ్ధిపొందారు. ప్రస్తుతం 8,873 మంది అమృతహస్తం పథకంతో లబ్ధిపొందుతున్నారు.
అమ్మహస్తం
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బతుకుభారమై.. ఎంతో మంది నిరుపేదలు కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిరుపేదలకు ఆసరాగా ఏడాదిన్నర క్రితం అప్పటి సీఎం కిరణ్ అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఉప్పు, పప్పు, కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమలు, చక్కెర తదితర తొమ్మిది నిత్యావసర వస్తువులు సంచిలో వేసి తెల్లరేషన్ కార్డుదారులకు రూ.185కే పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తోంది. జిల్లావ్యాప్తంగా 9,38,072 మంది లబ్ధిదారులున్నారు.
ఆరోగ్యశ్రీ
ప్రతీ ఒక్కరికి విద్య, వైద్యం ఎంతో అవసరం. విషయాన్ని గ్రహించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నిరుపేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 900 పైచిలుకు రోగాలకు వైద్యం అందించి.. దానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించింది. జిల్లాలో ఏప్రిల్ 3, 2008న పథకం ప్రారంభమైంది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కింద.. జిల్లాలో 16 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. పథకం ప్రారంభం నుంచి.. ఈ ఏడాది మార్చి 7 వరకు జిల్లాలో 3,42,843 మంది రోగులను పరీక్షించారు. 1,15,160 మందికి శస్త్ర చికిత్స అందించారు. ఈ పథకంపై ఆశలు పెట్టుకున్న వారెంతో మంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు
ఇల్లు లేని నిరుపేదలకు.. రూ.3 లక్షల వ్యయంతో 125 గజాల స్థలంలో రెండు బెడ్‌రూమ్‌లు, హాలు, వంటగది, టాయిలెట్లతో ఇల్లు నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో ఇల్లు లేని నిరుపేదల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం అమలు చేసిన, ప్రస్తుతం కొనసాగుతున్న ఇందిరమ్మ 1,2,3, రచ్చబండ దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. పథకంలో భాగంగా.. జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు బిల్లులు రాకపోయినా తమ సొంత డబ్బుతో ఇల్లు నిర్మించుకున్నారు. బిల్లులు రాక మధ్యలో చిన ఇళ్లూ ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నవ గృహ పథకాన్ని అమలు చేస్తే.. బకాయి ఉన్న బిల్లులు వస్తాయో రావోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.