బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్!!
దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ హబ్ గా పేరొందిన రంగారెడ్డి జిల్లాలో కోళ్లు, కోడిమాంసం విక్రయాలు కుదేలవుతున్నాయి. బర్డ్‌ప్లూ కారణంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో చికెన్ సెంటర్లు వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. కోళ్లేకాదు.. కనీసం కోడి గుడ్లు కూడా కొనేందుకు కూడా జనం ఆసక్తి చూపడంలేదు.
దీంతో పౌల్ట్రీఫాం, చికెన్ సెంటర్‌ల యాజమానులు తలలు పట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లో బర్డ్‌ప్లూ వ్యాధి వెలుగు చూడడంతో లక్షల కోళ్లను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, కోళ్ల పరిశ్రమ దెబ్బతినకుండా బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు.